చిగురిస్తున్న ఆశలు (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిగురిస్తున్న ఆశలు (కృష్ణాజిల్లా)

విజయవాడ, మార్చి 8  (way2newstv.com): 
మామిడి.. ఈ దఫా తమకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. దిగుబడి తగ్గినా ధర పెరిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఈ సీజన్‌లో చెట్లకు పూత విపరీతంగా వచ్చింది. కాకపోతే బాగా ఆలస్యమైంది. వాతావరణంలో మార్పులు అన్నదాతకు మేలు చేసింది. కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మంచి ధర పలికితే లాభాలు కళ్ల చూడవచ్చని అన్నదాతలు ఆశిస్తున్నారు. గతేడాది దిగుబడి, ధర ఆశాజనకంగా ఉండటంతో గట్టెక్కారు. ఈసారి ధర తగ్గినా దిగుబడులు పెరిగితే మంచి లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. జైకాతో ఉన్న ఒప్పందంతో ఈ ఏడాది జిల్లా నుంచి మధ్యవర్తులు లేకుండానే నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులను సిద్ధం చేస్తున్నారు. ఇది విజయవంతం అయితే జిల్లాలో విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో దాదాపు 68వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. పశ్చిమ కృష్ణాలోని ఆగిరిపల్లి, మైలవరం, నూజివీడు, రెడ్డిగూడెం, ఛాట్రాయి, విస్సన్నపేట, తిరువూరు, జి.కొండూరు, గంపలగూడెం, తదితర మండలాల్లో విస్తారంగా మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 80 శాతం విస్తీర్ణం ఈ ప్రాంతాల్లోనే ఉంది. బంగినపల్లి, రసాలు, తోతాపురి రకాలు ప్రధానమైనవి. జిల్లా నుంచి ముంబయి, అహ్మదాబాద్‌, దిల్లీ, తదితర ఉత్తరాది ప్రాంతాలకు పెద్దఎత్తున ఎగుమతులు జరుగుతాయి. సాధారణంగా అన్ని రాష్ట్రాలకెల్లా కృష్ణా జిల్లాలోనే మామిడి పంట ముందుగా వస్తుంది. ఆ తర్వాతే మిగిలిన ప్రాంతాల నుంచి దిగుబడి మార్కెట్లకు వస్తుంది. ఈ దఫా వాతావరణంలో మార్పుల కారణంగా పూత ఆలస్యమైంది. ఏటా నవంబరులో పూత వస్తుంది. మార్చి నాటికి మార్కెట్‌కు కాయలు వస్తాయి. రాష్ట్రంలో మరో ప్రధాన జిల్లా అయిన చిత్తూరులో ఆలస్యంగా పంట వస్తుంది. జనవరిలో పూత వచ్చి, ఏప్రిల్‌ ఆఖరుకు కాయలు వస్తాయి. అప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన కాయలు ఎగుమతి అవుతాయి. కానీ.. ఈ సీజన్‌లో కాయలు ఆలస్యంగా రానున్నాయి.2016లో పూత అరకొరగా రావడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. 30 శాతమే దిగుబడి వచ్చింది. బంగినపల్లి ఎకరాకు 2 టన్నులు, రసాలు 3 టన్నులు, తోతాపురి 3.5 టన్నుల వరకు వచ్చింది. జిల్లాలో సుమారు 3లక్షల టన్నుల వరకు వచ్చింది. 2017లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒకేసారి పూత, దిగుబడి వచ్చింది. దీని వల్ల ధర పతనమైంది. 


చిగురిస్తున్న ఆశలు (కృష్ణాజిల్లా)

మామిడిలో రెండేళ్లకోసారి మాత్రమే మంచి దిగుబడులు వస్తాయి. 2017లో దిగుబడి బాగానే వచ్చింది. ధర కూడా ఆశాజనకంగానే ఉంది. దీంతో చాలా వరకు లాభాలు వచ్చాయి. గతేడాది హెక్టారుకు 9 మె.ట చొప్పున మొత్తం 5 లక్షల మె.టన్నుల మేర దిగుబడి వచ్చింది. సీజన్‌ ప్రారంభంలో టన్ను.. రూ.65వేలు పలికింది. తర్వాత టన్ను రూ.25వేలు వచ్చింది. చివరలో రూ.15వేలు వరకు పడిపోయింది. అన్ని ప్రాంతాల నుంచి కాయలు ఒకేసారి మార్కెట్‌కు రావడమే కారణం. జిల్లాలో పండిన మామిడి.. సుమారు వెయ్యి టన్నుల వరకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయింది.
ఈ సీజన్‌లోనూ కొంత మేర ఆశాజనకంగానే ఉంటుందని భావిస్తున్నారు. జనవరిలో ప్రతికూలంగా ఉన్న వాతావరణం.. అనూహ్యంగా అనుకూలంగా మారింది. చలి, మంచు దెబ్బకు పూత సరిగా రాలేదు. వచ్చింది కూడా సక్రమంగా ఎదగలేదు. ఇంతలో ఎప్పుడూ లేనివిధంగా ఫిబ్రవరిలోనే వాతావరణం వేడిగా మారింది. దీంతో పూత రావడం ప్రారంభమైంది. వచ్చిన దాంట్లో పిందెలు బాగానే వస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. దీంతో ఆలస్యమైంది. అయినా మంచి దిగుబడులు వస్తాయని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కాయలు కÛనిపిస్తున్నాయి. ఈసారి చాలా వరకు చీడపీడల ప్రభావం పెద్దగా లేదు. ఇది రైతులకు ఊరటనిచ్చే విషయం. గత ఏడాది కంటే కొంత మేర దిగుబడి తగ్గే అవకాశం ఉంది. 4 నుంచి 4.5 టన్నుల వరకు వస్తుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వెయ్యి టన్నుల మేర నేరుగా విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. జైకా ప్రాజెక్టు కింద.. కృష్ణా జిల్లాలోని మామిడిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దిగుబడిని సాధించి ఇతర దేశాలకు పంపించాలన్నది లక్ష్యం. దీని కింద ఈ ఏడాది 100 హెక్టార్లను ఎంపిక చేశారు. ఇందులోని రైతులను శాస్త్రీయంగా శిక్షణ ఇచ్చారు. ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా, ఎగుమతి ప్రమాణాల మేరకు పండిస్తున్నారు. ఈ తోటల నుంచే వాటిని అన్ని రకాల పరీక్షలు నిర్వహించి.. మధ్య ప్రాచ్య దేశాలు, కొరియా, ఐరోపా, అమెరికా దేశాలకు ఉత్పత్తి నేరుగా వెళ్తుంది. ఈ ప్రయోగం ఫలించి, డిమాండ్‌ వస్తే.. విస్తీర్ణం మరింత పెరగనుంది.