తిరుపతి, మార్చి 14, (way2newstv.com)
ఏపీలో ఈ నెల16 నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో శ్రీవారి దర్శనం అనంతరం సేవామిత్ర, బూత్ కమిటీల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అదే రోజు శ్రీకాకుళం సభలో పాల్గొంటారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే సభల్లో పాల్గొంటారు. 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో టీడీపీ బహిరంగ సభలకు హాజరవుతారు… 19న కర్నూల్, అనంతపురం, కడప జిల్లాలో సభలకు టీడీపీ సిద్ధమవుతోంది. సమయం తక్కువగా ఉండటంతో వీలైనంతమేరకు రాష్ట్రాన్ని చుట్టేలా ప్రచారానికి ప్రిపేర్ అవుతున్నారు చంద్రబాబు… బస్సు యాత్ర ద్వారా ప్రచారానికి ప్లాన్ వేసుకుంటున్నారు… ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు.అటు లోకేష్ సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
సేమ్ సెంటిమెంట్ తో చంద్రబాబు ప్రచారం
చంద్రబాబు పర్యటన ఓ ప్రాంతంలో, లోకేశ్ టూర్ మరో ప్రాంతంలో ఉండేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. మరో రెండు, మూడు రోజుల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞులని.. విభజన నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులను అంచనా వేసే తీర్పు ఇస్తారని భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మూడు రోజులపాటు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి, మినహాయింపు లేదని.. గెలుపే లక్ష్యంగా యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు తెలిపారు.నేతలందరికీ తగిన గుర్తింపు ఇస్తామని.. భవిష్యత్తులో పదవులిస్తామని తెలిపారు. కుటుంబం లాంటి పార్టీ కోసం ఇప్పుడు అండగా ఉన్నవారందరి భవిష్యత్తునూ పార్టీ చూసుకుంటుందన్నారు చంద్రబాబు… కుట్రలపై జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు చెప్పారు.. తిరుపతి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం టీడీపీ ఆవిర్భావం నుంచి సంప్రదాయంగా కొనసాగుతోంది… తిరుపతి నుంచి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తమకు కలిసివస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. తిరుపతి నుంచి ప్రచారం ప్రారంభించినా.. కొన్ని ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కలిసొస్తుందా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.