ఎంపీ అభ్యర్థులనుబట్టే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక : మంత్రి అయ్యన్న
విశాఖపట్నం, మార్చి 11 (way2newstv.com )
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో ఇంత వరకు ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో తొలుత ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని, ఆ తర్వాత సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. చంద్రబాబునాయుడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో జరిపిన వరుస సమావేశాల్లో కేవలం అభిప్రాయాలను మాత్రమే అడిగి తెలుసుకున్నారన్నారు. ఈ నెల 14వ తేదీన టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటిస్తారన్నారు. అనకాపల్లి ఎంపీ స్థానానికి సంబంధించి తన కుమారుడు విజయ్‌తోపాటు ఆడారి ఆనంద్, కొణతాల రామకృష్ణల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, వీరి గురించి ప్రజలు, పార్టీ వర్గీయుల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించారన్నారు.
జిల్లాలో ఏ ఒక్కరికీ టిక్కెట్ ఖరారు కాలేదు
కొణతాల రామకృష్ణ పట్ల మొగ్గు చూపుతున్నప్పటికీ ఎమ్మెల్యేగా వుండాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారన్నారు. విజయ్ అభ్యర్థిత్వం గురించి సోమవారం చంద్రబాబుతో మరోసారి చర్చించనున్నట్టు మంత్రి తెలిపారు. విజయ్‌కు టిక్కెట్ ఇవ్వకపోయినా తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. మంత్రి లోకేశ్ విశాఖ జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు మంత్రి అయ్యన్న తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి రావాలనుకునే మహిళలు, యువతకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నామన్నారు. సామాజిక పింఛన్ల మంజూరు వయోపరిమితిని పురుషులకు 60, మహిళలకు 55 ఏళ్లకు తగ్గించనున్నామని తెలిపారు. ప్రస్తుతం గిరిజనులకు వర్తింపచేస్తున్న 50 ఏళ్లకే పింఛన్ నిబంధనను అన్ని రకాల చేతివృత్తిదారులకు అమలు చేస్తామని మంత్రి అయ్యన్న పేర్కొన్నారు