మోదుగులను దూరం పెట్టేరా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మోదుగులను దూరం పెట్టేరా

గుంటూరు, మార్చి 6 (way2newstv.com)
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ మారతారన్నది గత కొంతకాలం నుంచి అందరూ ఊహించిందే. ఆయన గత రెండేళ్లుగా తెలుగుదేశం అధిష్టానం వైఖరితో విసిగిపోయి ఉన్నారు. గతంలో ఆయన నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ పక్షాన సమైక్యాంధ్ర కోసం పోరాడారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో మోదుగులను పార్లమెంటు స్థానం నుంచి తప్పించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి చంద్రబాబునాయుడు పోటీ చేయించారు. అక్కడి నుంచి గెలిచిన ఆయన తనకు మంత్రి పదవి దక్కుతుందేమోనని ఆశించారు.అయితే గుంటూరు జిల్లాలోని టీడీపీ రాజకీయాలకు ఆయన ఇమడ లేకపోయారు. కనీసం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మోదుగులకు సహకరించలేదు. దీంతో గత రెండేళ్లుగా మోదుగుల పార్టీపై అసంతృప్తిని పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 


మోదుగులను దూరం పెట్టేరా

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తుందని మోదుగుల భావిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రితోనూ ఆయన పొసగడం లేదు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.వచ్చే ఎన్నికలలో ఆయనను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పించి మాచర్ల నియోజకవర్గానికి పంపించాలన్న ప్లాన్ లో అధిష్టానం ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి పార్టీ పైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కొంతకాలం క్రితం వనభోజనాల సందర్భంగా ఒక సామాజిక వర్గం ఏర్పాటు చేసుకున్న సమావేశానికి వెళ్లి జగన్ కు ఓటేయాలని పరోక్షంగా చెప్పడం అప్పట్లో కలకలం రేపింది. అప్పటి నుంచి పార్టీ అధిష్టానం మోదుగులను దూరంగా పెట్టింది. నిజానికి వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడ ఛాన్స్ లేదు. ఇప్పటికే అక్కడ రాయపాటి సాంబశివరావు ఉన్నారు.మోదుగుల పార్టీ మారాలని కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రేపు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ ను నరసరావుపేట పార్లమెంటు టిక్కెట్ కోరే అవకాశముంది. గతంలో తాను విజయం సాధించిన నరసరావుపేటనే మోదుగుల ఆశించడం, అక్కడ వైసీపీకి సరైన అభ్యర్థి ఎవరూ లేకపోవడం కూడా ఆయనకు కలసివచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే రెండేళ్లుగా అసంతృప్తిగా ఉన్న మోదుగుల పార్టీనుంచి వెళ్లాలనే తెలుగుదేశం పార్టీ పొగ పెట్టిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.