కొత్త శత్రువులతో బాబు తలనొప్పి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొత్త శత్రువులతో బాబు తలనొప్పి

హైద్రాబాద్, మార్చి 4, (way2newstv.com)
తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకొని చంద్రబాబు నాయుడు అనవసరంగా కొత్త శత్రువులను తయారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇలా తెలంగాణలో తయారైన శత్రువులు ఇప్పుడు ‘టార్గెట్ చంద్రబాబు’ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఎలా అభివృద్ధి జరిగిందో చెప్పారు. కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఆయన ఎలాగైనా కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ పట్ల కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. ఆయనేమో కానీ చంద్రబాబును మరో ఇద్దరు తెలంగాణ నెతలు బాగా టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.


కొత్త శత్రువులతో బాబు తలనొప్పి

ఒకప్పటి చంద్రబాబు సహచరుడు, ఇప్పటి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓడిపోవాలని కోరుకుంటున్నారు. 2014లో టీడీనీలో గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి పదవి చేపట్టిన తలసానిని చంద్రబాబు ఇటీవలి ఎన్నికల్లో టార్గెట్ చేశారంట. ఆయనను ఓడించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారంట. పార్టీ మారిన తన కులస్థులను వదిలేసి బీసీనైనందునే చంద్రబాబు తనను టార్గెట్ చేశారనేది తలసాని ఆరోపణ. దీంతో తనపై కక్ష కట్టి ఓడించాలని ప్రయత్నించిన చంద్రబాబును ఇప్పుడు తలసాని టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఏపీలో పర్యటించి బలప్రదర్శన చేశారు. బీసీలు.. ముఖ్యంగా యాదవుల ఓట్లను ఏకం చేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా వారిని నడిపించాలని తలసాని భావిస్తున్నారు. చంద్రబాబును ఓడించాలని పిలుపునిస్తానని ఆయన బాహాటంగానే చెబుతున్నారు. చంద్రబాబు బీసీలకు వ్యతిరేకంగా అని చెబుతున్నారు. ఏపీలో తనకు బంధువులు, స్నేహితులు ఉండటంతో తలసాని ఈ ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. జగన్ కు ఓటేయాలని నేరుగా చెప్పకపోయినా చంద్రబాబుకు మాత్రం వేయొద్దని తలసాని పిలుపునిచ్చే అవకాశం ఉంది.ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ కూడా ఏపీలో అడుగుపెడతానని ప్రకటించారు. నిన్న పార్టీ కార్యాలయం దారుస్సాలాంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఈ విషయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆయన నేరుగా జగన్ కు మద్దతు ప్రకటించారు. జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పారు. జగన్ తో అసదుద్దిన్ కు ముందునుంచే స్నేహం ఉంది. వైఎస్ వల్ల ముస్లింలకు రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వాటితో మేలు జరిగిందని అసద్ భావిస్తున్నారు. దీనికి చంద్రబాబుపైన కోపం కూడా తోడయ్యింది. బీసీలు, ముస్లింల ఓట్లను సమీకరించాలనేది వీరిద్దరి ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే, ఇలా కక్ష కట్టి చంద్రబాబుపైకి వెళ్తే చంద్రబాబుకు నష్టం జరుగుతుందో లేదో కానీ లాభం కలిగే అవకాశం కూడా ఉంది. చంద్రబాబుపై అందరూ కక్ష కట్టారనే ఓ సానుభూతి కూడా ప్రజల్లో వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో కేసీఆర్ కు ఇటువంటి సానుభూతి కలిసివచ్చిన విషయం తెలిసిందే. మరి, వీరిద్దరూ చంద్రబాబును టార్గెట్ చేసి ఆయన విజయావకాశాలను దెబ్బతీస్తారో లేదా తెలంగాణకు వచ్చి కేసీఆర్ కు చంద్రబాబు లాభం చేసినట్లు వెళ్లి అక్కడ చంద్రబాబుకే లాభం చేస్తారో చూడాలి.