మీడియా కధనాలు బాధిస్తున్నాయి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మీడియా కధనాలు బాధిస్తున్నాయి

కడప, మార్చి 20 (way2newstv.com)
గతవారం దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, బుధవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆమె... నాన్నకు తానంటే ఎంతో ప్రేమని, ఆయన చనిపోయిన బాధ కంటే తర్వాత మీడియాలో వచ్చిన కథనాలే తమను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని అవమానించేలా మాట్లాడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాదు, పులివెందుల ప్రజలంటే నాన్నకు ఎంతో అభిమానమని, కుటుంబ కంటే వారే ముఖ్యమని అన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా వెళ్లి అండగా నిలబడేవారన్నారు. అమ్మ కూడా అనారోగ్యంతో బాధపడుతోందని, నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారని తెలియజేశారు. ఆయనను చాలా దారుణంగా హత్య చేశారని, ఈ ఘాతుకానికి పాల్పడిన హంతకులను గుర్తించడం ముఖ్యమని అన్నారు. 


 మీడియా కధనాలు బాధిస్తున్నాయి


మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని, 700 మంది వరకు ఉండే కుటుంబలో చిన్న చిన్న స్పర్ధలు సహజమేనని వివరించారు. జగనన్న సీఎం కావాలని నాన్న కలగన్నారని, అందుకోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. దీనిపై ఓ వర్గం మీడియా ఎన్నో వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తోందని, ఇది ఎంతమాత్రమూ సరికాదని ఆమె హితవు పలికారు. అంతేకాదు కుటుంబం అన్నాక విభేదాలు, అభిప్రాయభేదాలు సహజమని, అంతమాత్రాన చంపుకుంటామా? అని ప్రశ్నించారు. హత్య కేసులో విచారణ నిజాయితీగా, నిష్పక్షపాతంగా సాగాలని ఆమె కోరారు. సిట్ విచారణ కొనసాగుతోందని, అధికారులు అడిగిన వివరాలకు సమాచారం అందజేశామని వైఎస్ సునీత అన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మిగతా అంశాలను వెల్లడిస్తామని తెలిపారు. పెద్ద కుటుంబం మీద ఆరోపణలు చేస్తే ఎంతో బాధ కలుగుతుందని అన్నారు. విచారణ ఎవరు చేసినా అది నిష్పక్షపాతంగా జరగాలని, ఇంత కంటే తాను ఇప్పుడు ఏం మాట్లాడలేనని పేర్కొన్నారు. దయచేసి నా బాధను అర్ధం చేసుకోవాలని సునీత ఆవేదన చెందారు. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డిని బెంగళూరులో ఉన్న సైట్ దగ్గరకు తీసుకెళ్లిన సిట్ అధికారులు, హత్యకు ముందు కోట్ల రూపాయలు చేతులు మారినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శేఖర్‌ల బ్యాంకు ఖాతాల్లో భారీగా డబ్బులు జమ అయ్యాయని కూడా సిట్ అధికారులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో వివేకా ఇంటి పరిసరాల్లోనే శేఖర్ రెడ్డి ఉన్నట్టు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.