తెలంగాణలో ఐదు స్థానాలపై కమలం గురి... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో ఐదు స్థానాలపై కమలం గురి...

హైద్రాబాద్, మార్చి 28 (way2newstv.com)
ఈ సారి దక్షిణాది నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం... ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తెలంగాణలోనూ ఎన్నో కొన్ని సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ... అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు కొద్ది వారాల ముందు కీలకమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం దృష్టి పెట్టింది. ఇందులో కొంతమేర విజయం సాధించింది కూడా. అయితే తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఐదు సీట్లే అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సీట్లలో పాగా వేయగలిగితే... తాము అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఎక్కువగా గురి పెట్టిన స్థానాల జాబితాలో సికింద్రాబాద్, చేవేళ్ల, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ ఉన్నట్టు తెలుస్తోంది. తమ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ నుంచి ఈ సారి బండారు దత్తాత్రేయకు బదులుగా మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని రంగంలోకి దించుతోంది బీజేపీ. మరోసారి ఈ స్థానాన్ని కైవవం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. 


తెలంగాణలో ఐదు స్థానాలపై కమలం గురి...

చేవేళ్ల నుంచి బండారు దత్తాత్రేయ వియ్యంకుడు జనార్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన చాలాకాలంగా ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మోదీ మేనియా కలిసొచ్చి, మరింత కష్టపడితే ఈ సీటు తమ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఇక మహబూబ్ నగర్ స్థానంపై ఈ సారి బీజేపీ ఎక్కువగా దృష్టి పెట్టింది. జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీమంత్రి డీకే అరుణ ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి పాలమూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి కూడా బీజేపీ గూటికి చేరారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి కలిసి ఈ సీటును బీజేపీ ఖాతాలో పడేలా చేస్తారని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇక గతంలో బీజేపీ గెలిచిన కరీంనగర్ స్థానం నుంచి ఈ సారి బండి సంజయ్ బరిలో ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో సానుభూతి ఎక్కువగా ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ బలంగా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్ తనయుడు అరవింద్ బరిలో ఉన్న నిజామాబాద్ స్థానంపై కూడా బీజేపీకి ఆశలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చాలాకాలం నుంచి పని చేసుకుంటున్న అరవింద్... ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు కాలం కలిసొస్తే అదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న సోయం బాపురావు కూడా గెలిచే అవకాశం ఉందని బీజేపీ ఆశిస్తోంది. మొత్తానికి తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకుంటుందా లేదా అన్నది చూడాలి.