కందుకూరు, మార్చ్ 29 (way2newstv.com)
ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నాయి. విలువలకు, వంచనకు మధ్య జరుగుతున్నాయి. ఒక్క సారి వైఎస్సార్ పాలనను గుర్తుకు తెచ్చుకోండని వైకాపా అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. శుక్రవారం నాడు ఆమె కందుకూరులో మాట్లాడారు. వైఎస్ఆర్ ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మీ అందరి సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మీ భుజస్కంధాలపై వైయస్ రాజశేఖర్ రెడ్డి ని మోశారు. ఆయన సీఎం అయి అందరికి సంక్షేమ పథకాలు అందించారు. తొమ్మిదేళ్లుగా జగన్ బాబు మీలోనే ఉన్నాడు. మీరొకటి గుర్తుంచుకోండి. గత ఎన్నికల్లో కొద్ది మెజార్టీతో మనం ఓడిపోయాం. ఈసారి ఆ తప్పు చేయద్దని వేడుకుంటున్నాను. వైయస్ మరణం తర్వాత ఈ తొమ్మిదేళ్లలో మేము నష్టపోయిన దానికన్నా ఈ రాష్ట్రం నష్టపోయింది ఎక్కువ. వైయస్సార్ మరణం తర్వాత సాగిన పాలన చూస్తే బాధేస్తోంది. ప్రజల కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది.
విలువలు, వంచలన మధ్యల పోటీ
వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ బాబు మీకోసం నిలబడ్డాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైయస్సార్ మంచోడే.. జగన్ బాబు మంచోడే.. ఎప్పుడైతే బయటికి వచ్చాడో కేసులు పెట్టారు. ఈ కుటుంబాన్ని క్షోభ పెట్టారు. ఓదార్పు యాత్ర చేస్తానని పావురాలగుట్టలో జగన్ బాబు మాట ఇచ్చాడు. మీకోసం నిలబడ్డాడు. మీరు జగన్ బాబుని అక్కున చేర్చుకోవడం...వైఎస్ఆర్ కోసం అంత మంది చనిపోవడం కాంగ్రెస్ కు నచ్చలేదు. జగన్ కు వచ్చిన కష్టాలు చాలా ఉన్నాయి. ఆయన మీతో ఎప్పుడూ చెప్పలేదు.
ప్రత్యేక హోదా కోసం..జనం కష్టాలు తీరడం కోసం జగన్ బాబు ఎన్నో దీక్షలు చేశారు. ధర్నాలు చేశారు. నేను కూడా దీక్ష చేశాను. ఎన్నికలు ఉన్నాయని మూడు నెలల నుంచి చంద్రబాబుకు మీరు(ప్రజలు) గుర్తొస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎప్పుడు బయటకు రాలేదు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక... జగన్ బాబును జైల్లో పెట్టారు. 18 మందిని గెలిపించుకోవడానికి బయటకు వచ్చా. మీరంతా నా కుటుంబం. అందుకని నేను బయటకు రావాల్సి వచ్చింది. ఈ తొమ్మిదేళ్లలో జగన్ బాబు మీతోనే ఉన్నాడు. ఒకటే చెప్తున్నా జగన్ అనుకుంటే చేస్తాడు.. సాధిస్తాడు. రాజారెడ్డిని హత్య చేశారు. ఎవరు సాయం చేశారో మనమంతా చూశాం. తొమ్మిదేళ్ల క్రితం వైయస్సార్ మృతి చెందారు. అది అనుమానాస్పద మృతి అని నా నమ్మకం. నాలుగు నెలల క్రితం వైజాగ్ లో గుండుసూదులు కూడా పోని చోట కత్తులు వెళ్లాయి. మా మరిదిని కూడా హత్య చేశారు. ఈ నలుగురు ప్రజల కోసం నిలబడిన వాళ్లేనని అన్నారు. జగన్ బాబుని మీ ఆశీర్వాదం బలమే నడిపిస్తోంది. తొమ్మిదేళ్లలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు భరించాడు. 16 నెలల పాటు కొడుకును దూరం చేశారు. పాదయాత్రకు వెళ్లే సమయంలో నా బిడ్డను మీకు అప్పగించాను. మీ ఆశీర్వాద బలమే గండం నుంచి జగన్ బాబును గట్టెక్కించిందని అన్నారు.