ముప్పు పొంచి ఉంది ( మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముప్పు పొంచి ఉంది ( మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, మార్చి 4  (way2newstv.com): 
వేసవికాలం ఇంకా పూర్తిగా రాకముందే ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఆరు నెలల క్రితం నిండుకుండల్లా ఉన్న జలాశయాల్లో ఇప్పుడు నీటిమట్టం పూర్తిగా అడుగంటింది.   వ్యవసాయానికి అనువుగా బోర్లలో పుష్కలంగా ఉన్న నీరు కూడా   ఇప్పుడు అథఃపాతాళానికి చేరుకుంటోంది. వ్యయప్రయసాలకు ఓర్చి దూరప్రాంతాల నుంచి ఆయా పట్టణాలకు, గ్రామాలకు తరలిస్తున్న తాగునీరు నిర్వహణపరమైన లోపాలతో ప్రజల దాహార్తిని తీర్చకుండానే రోడ్లపాలు అవుతోంది. కొళాయిలకు నీటిని వదలాల్సిన అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినట్లు రాత్రివేళల్లో వదలడంతోనూ మంచినీటితో సంపులు నిండి వృథాగా పోతున్నాయి. ముఖ్యంగా పురపాలికల్లో ఇలా ప్రతి నిత్యం కొన్ని వేల లీటర్ల నీరు దుబారా అవుతోంది. మిద్దెలపై ఉన్న నీటి ట్యాంకులకు నీటిని ఎక్కించిన తరవాత అవి నిండినా సకాలంలో బందు చేయక పోవడంతోనూ చాలా నీరు వృథా అవుతోంది. నీటిని ఇలా పలు రకాలుగా ఇష్టం వచ్చినట్లు దుబారా చేస్తే మునుముందు నీటి కష్టాలు తప్పవు. జిల్లాలో గతేడాది 18 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది మరో అయిదు నెలల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండదు. వేసవి ఎండలు ఫిబ్రవరి నుంచే మండుతుండటంతో రానురాను నీరు ఎక్కువగా ఆవిరయ్యే ప్రమాదముంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూగర్భజలాలు 15.87 మీటర్ల సగటు లోతున ఉన్నాయి.



 ముప్పు పొంచి ఉంది ( మహబూబ్ నగర్)

నీటి దుబారాను అరికట్టేందుకు ఇది మరో మార్గం. ఇళ్లలో దీనిని అమర్చుకుంటే.. పైనున్న ట్యాంకుకు నీటిని వదిలిన తరవాత అది నిండిన వెంటనే మోటారును మనం బందు చేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ట్యాంకులో నీరు తగ్గిన తరవాత అదే మళ్లీ స్టార్ట్‌ అవుతుంది. ఇలాంటి మోటార్లతో నీరు కూడా దుబారా కాకుండా నియంత్రించవచ్చు. పురపాలికలు, గ్రామ పంచాయతీల్లో చాలాచోట్ల రాత్రి పూట నీటి విడుదల చేస్తున్నారు. దీంతో దుబారా ఎక్కువగా అవుతుంది. కొళాయిలకు నీరు వదిలే వేళలను ముందుగా ప్రకటించి.. దాని ప్రకారమే విడుదల చేస్తే ఆ నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. రాత్రిపూట నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక చాలామంది ఇంటి యజమానులు తమ సంపుల్లో పైపులు వదిలి స్విచ్‌ ఆన్‌ చేసి పడుకొంటున్నారు. అర్ధరాత్రి.. అపరాత్రి నీటిని విడుదల చేయడంతో సంపులు నిండి నీరంతా వృథాగా పోతోంది.  అధికారులు పగటిపూట నీటిని విడుదల చేయడంపై దృష్టి సారిస్తే మంచిది
ఇళ్ల యజమానులు సంపుల్లº నుంచి నీటిని పైకి ఎక్కించడానికి మిద్దెలపై 500 నుంచి 2 వేల లీటర్ల సామర్థ్యం గల నీటిట్యాంకులను ఏర్పాటు చేసుకొంటున్నారు. వాటిని నింపడానికి మోటార్లను వాడుతున్నారు. ట్యాంకులు నిండిన తరవాత సకాలంలో ఆఫ్‌ చేయడం లేదు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఈ నీటి వృథాను అరికట్టేందుకు పలురకాల సాధానాలు ఉన్నాయి. కేవలం రూ.150 ఖర్చుతో ట్యాంకర్‌ అలారం బజార్లలో దొరుకుతోంది. ట్యాంకర్‌ అలారాన్ని ఇంట్లోనే ఉంచి.. దాని వైరును ఇంటిపై నున్న ట్యాంకులో వదిలేస్తే అది నిండినప్పుడు వెంటనే అలారం మోగుతుంది. మోటార్‌ను బంద్‌ చేసి నీటి వృథాను నియంత్రించవచ్చు.