కోడ్ కష్టాలు (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోడ్ కష్టాలు (పశ్చిమగోదావరి)

ఏలూరు, మార్చి 9 (way2newstv.com): 
జిల్లాలో అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే రూ. వందల కోట్ల అభివృద్ధి పనులకు ఎన్నికల నియమావళి అడ్డొచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. జిల్లా మొత్తమ్మీద ఎస్సీ ఉపప్రణాళిక నిధులు, 14వ ఆర్థిక సంఘం ప్రభుత్వపరమైన నిధులతో పాటు స్థానిక సంస్థల సొంత నిధులు కలిపి మొత్తంగా రూ. 500 కోట్లకు పైగానే పనులు నిలిచిపోయాయి. ప్రధానంగా అన్ని పట్టణాల్లోను ఎస్సీ ఉపప్రణాళిక నిధులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు రెండేళ్లలో మొత్తంగా రూ. 117 కోట్ల పనులు ఆయా పురపాలక సంఘాల్లో ఎస్సీ ప్రాంతాల్లో జరగాలి. ఈ నిధులతో చేపట్టే పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. మొదటి నుంచి ఈ పనుల్లో తీవ్రజాప్యం నడుస్తోంది. దీంతో ఏలూరు నగరంతో పాటు పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం పట్టణాల్లో మెల్లగా నడుస్తున్నాయి. అన్నింటిలో కలిపి రూ. 42 కోట్ల పనుల్లో మాత్రమే కదలిక వచ్చింది. మిగిలిన రూ. 75 కోట్ల పనులకు సాంకేతిక అనుమతులు రాకపోవడం.. పాలకవర్గ సమావేశ ఆమోదం పొందకపోవడం.. టెండర్లు నోచుకోకపోవడం వంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దశలో కోడ్‌ అమలులోకి రావడంతో ఇవన్నీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఎన్నికల నియమావళి నెలాఖరు వరకు ఉండడంతో నిధులు వెచ్చించాల్సిన గడువు తీరుతుంది. అంటే ఇక ఎస్సీ ప్రాంతాల్లో పనులు నోచుకోలేనట్లే. ప్రస్తుతం నడుస్తున్న పనులు మాత్రమే ముందుకెళ్లతాయి. 14వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టే పనుల్లోను ఇదే తీరు కనిపిస్తోంది. ఎన్నికల నియమావళికి ముందు టెండర్‌ ఆమోదం పొంది కాంట్రాక్టర్ కి ఉత్తర్వులు ఇచ్చిన వాటిని మాత్రమే చేసే వీలుంటుంది. మిగిలిన ఏ దశలో ఉన్నా ముందుకెళ్లకూడదు. దీంతో పురపాలక సంఘాల్లో సొంత నిధులతోను చేపట్టే పనులకు అటంకం ఎదురైంది.



కోడ్ కష్టాలు (పశ్చిమగోదావరి)

పట్టణ ప్రాంతాల్లో కనీస మౌలికావసరాలు నోచుకోని ప్రాంతాల్లో చేపట్టదల్చిన పనులకు ఎన్నికల నియమావళి ఇబ్బంది ఎదురైంది. పురపట్టణాల్లో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం (సిప్‌) కింద అన్ని పట్టణాల్లోను రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు, ఉద్యానవనాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు వంటి ఏర్పాటుకు ప్రతిపాదించారు. అన్ని పట్టణాలకు కలిపి రూ. 222 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా పనులకు సంబంధించి ప్రభుత్వస్థాయిలోనే అన్ని పట్టణాల పనులకు ఒకే పనిగా టెండర్‌ పిలవగా ఓ సంస్థ దక్కించుకుంది. ఈ పనులకు సంబంధించి పాలకొల్లులో శంకుస్థాపన జరిపారు. పనులకు కాంట్రాక్టర్ అంగీకారపత్రం దాఖలు చేయాల్సిన సమయంలో ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఇప్పుడు ముందుకెళ్లే పరిస్థితి లేదు. పట్టణాల్లో తాగునీటి సరఫరా అభివృద్ధి పథకం కింద పాలకొల్లు, తణుకు, నిడదవోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం పట్టణాలకు గోదావరి జలాలు విజ్జేశ్వరం నుంచి నేరుగా వచ్చేలా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 348 కోట్లను మంజూరు చేసింది. తొలిగా రూ. 248 కోట్లతో పాలకొల్లు, తణుకు, నిడదవోలులో చేపట్టే పనులకు టెండర్లు ఖరారయ్యాయి. ఈ పనులు కదిలే పరిస్థితి లేదు. ఇతర ప్రభుత్వ నిధులకు సంబంధించిన పనులు పెద్దఎత్తున నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోను ఎస్సీ ఉపప్రణాళిక నిధులతో పాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ద్వారా జరగాల్సిన రూ. కోట్ల పనులు ఆగిపోయాయి.
పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఎన్నికల నియమావళి వచ్చేస్తుందని రెండు నెలలుగా పనులకు టెండర్‌ దాఖలు చేసేందుకు కాంట్రాక్టర్లు స్పందించలేదు. కొందరు ముందుకొచ్చి టెండర్‌ దాఖలు చేసినా దక్కిన తరువాత మొదలుపెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీనివలన రూ. కోట్ల పనులు ముందుకెళ్లడంలేదు. ప్రధానంగా చేసిన పనులకు రూ. కోట్లలో ప్రభుత్వం నుంచి బకాయిలు రావల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల తరుణం కావడంతో ఏ ఒక్క బిల్లు మంజూరుకు నోచుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడంలేదు. కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో చేద్దామనుకున్నా భవిష్యత్తులో చేసిన పనికి బిల్లు వస్తుందోరాదోననే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే రూ. లక్షల్లో రావల్సిన బిల్లులకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని కొత్త పనులు చేయాలంటే అప్పుఇచ్చే నాధుడు లేరని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.