విజయవాడ, మార్చి 26, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీడీపీ, తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలు సంధిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ యోచిస్తోంది. ఈ రెండు పార్టీలకు తమ సత్తా చూపి కీలకంగా వ్యవహరించాలని జనసేన సన్నద్ధమవుతోంది. ఎవరికి వారు కాబోయే సీఎం తామేనంటూ ప్రకటనలు చేసుకుంటుండంతో అసలు ప్రజలు ఎవరికి పట్టం కడతారోన్న ఆసక్తి నెలకొంది. అయితే మన రాజకీయ నేతలు ప్రజాబలం కంటే గ్రహబలానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. గ్రహాలు అనుకూలిస్తే అధికారం తమదేనని నమ్మతుంటారు. ఈ ఎన్నికల వేళ ఏపీలోని ముగ్గురు కీలక నేతల గ్రహ బలాలపై జ్యోతిష్యులు ఏమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జాతకంలో తొమ్మిదవ స్థానంలో గురు, శుక్రులు, దశమంలో రాహువు, పదకొండో స్థానంలో రవి, బుధుడు ఉండటం గొప్ప యోగమని పండితులు చెబుతున్నారు.
బాబుకు అనుకూలంగా గ్రహాలు....
జనాకర్షణకు, రాజ్యాధికారానికి అధిపతి అయిన గురుడు తొమ్మిది స్థానంలో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల చంద్రబాబుకు తొలినుంచీ కలిసొస్తుంది. దీని ప్రభావంతో 28ఏళ్లకే మంత్రి పదవి వరించింది. గత ఐదేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రిగా ఉండటానికి కూడా గురుబల ప్రభావమే అని చెబుతున్నారు. రవి మిత్రక్షేత్రమైన మేషంతో, బుధుడితో కలిసి ఉండటం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోగలరని పేర్కొంటున్నారు. చంద్రబాబుకు 2014 నుంచి శని మహాదశలో గురువు, అంతర్దశలో శని విదశ నడుస్తోంది. దీనివల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడూ అదే స్థితి కొనసాగుతుండటం వల్ల మొదట ప్రతికూలంగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో సానుకూల ఫలితాలు సాధించి తిరిగి అధికారం చేపట్టే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని విదశ కారణంగా అనేక అడ్డంకులను అధిగమించి గురుబలంతో మంచి ఫలితాలు సాధించి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రస్తుతం శని మహాదశ నడుస్తోందని పండితులు చెబుతున్నారు. శని తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ లగ్నాధిపతి అయిన బుధుడు-శని ఎదురు దృష్టిలో ఉన్నారు. దీని ప్రభావంతో ఆయన ప్రస్తుతం రాజ్యాధికారం చేపట్టే అవకాశం లేదని అంటున్నారు. 2014లో అధికారానికి చేరువలో వచ్చినప్పటికీ గురుబలం లేకపోవడం, శని మహాదశలో రాహు అంతర్దశ కారణంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోలేకపోయారని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా అధికారం చేతిదాకా వచ్చినట్టే వచ్చి జారిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
పవన్‌కు భవిష్యత్ ఉంది
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గురు మహాదశలో, రవి అంతర్దశలో నడుస్తుండటం వల్ల రాజకీయాల్లో ఆయన ఆకర్షణగా నిలుస్తున్నారని పండితులు చెబుతున్నారు. అయితే ఆయనకు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుండటంతో ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. రవి దశమంలో ఉన్నప్పటికీ సప్తమంలో ఉన్న శని విదిశ కారణంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన బలం మాత్రం ఆయనకు రాదని చెబుతున్నారు. అయితే ఆయన గ్రహ బలాలను బట్టి భవిష్యత్‌లో రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టే అవకాశం బలంగా ఉందని పేర్కొంటున్నారు.