తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్

హైద్రాబాద్,   మార్చి 4 (way2newstv.com
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం ఇప్పుడు ఆసక్తి రేకిస్తోంది. ఏపీలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారంను తెలంగాణలోని ఓ కంపెనీ తీసుకుని ఓట్ల తొలగింపు కార్యక్రమం చేస్తోందంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ విషయమై ఏపీ పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. హైదరాబాద్ లోని  ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించడం కొందర్ని అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం వివాదం రాజేసింది. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ డైరెక్టర్ అశోక్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో వారిని తెలంగాణ హైకోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశించడం కాక రేపుతోంది. డేటా చోరీ కేసు దర్యాప్తు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. కూకట్ పల్లిలో విచారణ కోసం వెళ్లిన ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు , వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జరుగుతున్న తతంగాన్ని వీడియో తీసి ఉన్నతాధికారులకు చేరవేద్దామంటే సెల్ ఫోన్లు పగులకొడతామని వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారని ఏపీ పోలీసులు ఆరోపించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇక ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేష్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. కూకట్ పల్లిలోని ఇందూ ఫార్చ్యూన్ విల్లాస్ కు చేరుకున్న ఏపీ పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టారు. వెంటనే అక్కడికి తెలంగాణ పోలీసులు వచ్చి లోకేష్ రెడ్డిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. దీంతో విచారణ ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులుగా మారింది. ఒక ప్రైవేట్ సంస్థకు ఏపీ ప్రజల వివరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉందని లోకేశ్వర్ రెడ్డి వాపోయారు. 


తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్  

ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులు నలుగురు కనిపించడం లేదంటూ ఆ సంస్థ సీఈఓ అశోక్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ లను  తెలంగాణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ ను  విచారించిన న్యాయమూర్తి కనిపించకుండా పోయిన నలుగురు ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులని  సోమవారం ఉదయం పదిన్నరకల్లా తన ముందు హాజరు పరచాలని ఆదేశించారు. మరోవైపు డేటా చోరీ కేసు వ్యవహారంపై అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ తో  సీఎం చంద్రబాబు నాయుడు మంతనాలు జరిపారు. లీగల్ గా తీసుకోవాల్సిన అంశాల గురించి చర్చించారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఓటర్ల సమాచారం సేకరణ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ సంచలనం...ఓటర్ల వ్యక్తిగత విషయాలు బట్టబయలు... కలకలం రేపుతున్న సైబరాబాద్ పోలీసుల విచారణ.... ఇది చెప్పింది ఎవరో కాదు.... ఓ ప్రముఖ జాతీయ వార్తా వెబ్ పోర్టల్ . ఆ కథనం నిజమే అన్నట్లుగా ప్రాథమిక సమాచారం సేకరించారు  హైదరాబాద్ పోలీసులు. సార్వత్రిక ఎన్నికలకు మరో 45 రోజుల సమయం మాత్రమే ఉండగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి అనుబంధంగా ఉన్న ఓ యాప్ కలకలం సృష్టిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా  దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం తీసుకుని ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతోందని ఆ జాతీయ వార్తా వెబ్ పోర్టల్ సంచలన కథనం ప్రచురించింది. ఇక ఆ యాప్ పేరు కూడా సేవా మిత్ర అని పేర్కొంది. దీన్ని నడుపుతున్నది హైదరాబాదులోని ఓ ప్రైవేట్ సంస్థగా పోలీసులు గుర్తించారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఏపీ ఓటర్ల పూర్తి సమాచారం అంటే వారి కులం, ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు, వారి కుటుంబ నేపథ్యం లాంటి సమాచారాన్ని భద్రపరిచినట్లు తెలుస్తోంది. 2018లో ఏపీలో 3.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అయితే ప్రస్తుతం 2019లో ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో వారి ఓట్లు నిజంగా ఉన్నాయో లేక తొలగించారో అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆ జాతీయ న్యూస్ పోర్టల్ తన కథనంలో పేర్కొందిప్రపంచాన్ని కుదిపేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా తరహాలోనే మోసం ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తోందని ఈసీ దృష్టికి కూడా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీసుకెళ్లింది. మరోవైపు ఓటర్ల పేర్లు కూడా తొలగించే ప్రయత్నం ప్రారంభించిందని ఆ ఆన్లైన్ జాతీయ న్యూస్ పోర్టల్ తన కథనంలో పేర్కొంది. సేవా మిత్ర యాప్ను ఒకప్పుడు ప్రపంచాన్నే కుదిపేసిన కేంబ్రిడ్జ్ అనలిటికాతో పోల్చింది ఈ జాతీయ న్యూస్ పోర్టల్. కేంబ్రిడ్జ్ అనలిటికా పలు సోషల్ మీడియా వెబ్సైట్ల నుంచి ఓటర్ల వ్యక్తిగత సమాచారం చోరీ చేసి ఆ తర్వాత ఆఓటరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో ముందే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే తరహా మోసం జరుగుతోందంటూ కథనం రాసుకొచ్చింది.  జాతీయ న్యూస్ పోర్టల్. స్మార్ట్ ఫోన్ లో ని  గూగుల్ ప్లే స్టోర్ లోకి  వెళితే సేవా మిత్ర యాప్ ఉంటుంది. అయితే ఈ యాప్ కేవలం తెలుగుదేశం అధికారిక యాప్ మాత్రమే అని ఇందులో రిజిస్టర్ అయిన క్యాడర్ మాత్రమే ఉంటారని న్యూస్ పోర్టల్ వెల్లడించింది. ఇక పార్టీ క్యాడర్ కు  ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుందని కార్యకర్తలకు నాయకులకు వారధిగా వ్యవహరిస్తుందని జాతీయ న్యూస్ పోర్టల్ వివరించింది. ఇక వీరు చేయాల్సిందంతా బూతు స్థాయిలో ఉన్న ఓటర్ల సమాచారం సేకరించి ఈ యాప్ లో  పోస్టు చేయడమే. బూతు స్థాయి ఓటర్ల దగ్గరకు వెళ్లినప్పుడు వీరు కొన్ని ప్రశ్నలు వారిని అడుగుతారని తెలుస్తోంది. ప్రశ్నలు ఇలాగున్నాయి: నియోజకవర్గంలోనే నివసిస్తున్నారా..? ఓటరు యొక్క కులం ఏమిటి..? వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు..? ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు...? వారు పార్టీలకు 1 నుంచి 100 మార్కులు వేయాల్సి వస్తే ఎన్ని మార్కులు వేస్తారు..? కుటుంబ సమాచారం, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంతటితో ఆగలేదు... యాప్ లో  ఇంకా ఓటర్ల కలర్ ఫోటో, టెలిఫోన్ నెంబరు, కుటుంబ సమాచారం, ఇప్పటి వరకు వినియోగించుకున్న ప్రభుత్వ పథకాలు, రాష్ట్రం తరుపున ఎంత సబ్సీడీ వస్తోందిలాంటి సమాచారం కూడా యాప్లో వాలంటీర్లు ఓటర్ల దగ్గర నుంచి సేకరించి యాప్ లో  పొందుపరుస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారంతోనే ఫలానా ఓటరు ఫలానా పార్టీకి ఓటు వేస్తారని అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది.  టీడీపీకి అనుకూలంగా లేకుంటే ఓటును తొలగించే ప్రక్రియ చేస్తున్నారని ఇది కేంబ్రడ్జ్ అనలిటిక తరహా మోసమే జరుగుతోందని జాతీయ న్యూస్ పోర్టల్ పేర్కొంది. ఈ యాప్ను ఎక్కడ తయారు చేశారు..? ఎవరు తయారు చేశారు..? ఇక సేవా మిత్ర యాప్ ను  హైదరాబాదులోని ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ తయారు చేసినట్లు జాతీయ న్యూస్ పోర్టల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐటీ గ్రిడ్స్ ఒక క్లయింట్ అని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాదులో వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ సమాచారంను టీడీపీ దొంగలిస్తోందంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో జరిగిన ప్రజాసాధికారిత సర్వే ద్వారా పౌరుల ఆధార్ నెంబర్లు, కులం, ఉపకులం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగిందని ఆయన జాతీయ న్యూస్ పోర్టల్ లో  పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఇలాంటి నీచమైన పనులకు టీడీపీ పాల్పడుతోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం వేరు రాజకీయపార్టీ వేరని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే టీడీపీ ఇంతటి దిగజారుడు కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. తమ ఇన్వెస్టిగేషన్ ద్వారా మోసాన్ని బట్టబయలు చేసిన హఫింగ్టన్ పోస్టు ఇదిలా ఉంటే ఆధార్ నెంబర్ ద్వారా కానీ, మతం ఆధారంగా కానీ , కులం పరంగా కానీ ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం ఎలా సేకరించవచ్చో చెబుతూ హఫింగ్టన్ పోస్ట్ అనే అంతర్జాతీయ ఆన్లైన్ సంస్థ తన ఇన్వెస్టిగేషన్ ద్వారా గతేడాది ఏప్రిల్లో బయటపెట్టింది. ఉపాధిహామీ, ప్రజాపంపిణీ వ్యవస్థకు ఇచ్చిన సమాచారం, ఇన్కంటాక్స్ సమాచారం, ఆస్తుల రికార్డుల ద్వారా, ఫోన్, బ్యాంకులోన్లు, స్కాలర్షిప్పులు పెన్షన్ వివరాల ద్వారా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలు మొత్తం సేకరించొచ్చని చెబుతూ హఫింగ్టన్ పోస్టు అనే మరో సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో  ప్రతి దానికి ఆధార్ నెంబరు ఇవ్వడం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు చాలా బయటపడ్డాయని సెక్యూరిటీ రీసెర్చర్ ఒకరు చెప్పారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులపై ఆధార్ సంస్థ విచారణకు ఆదేశించలేదు కదా... కనీసం స్పందింలేదని ఆ సెక్యూరిటీ రీసెర్చర్ చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  ఆధార్ ఛైర్మన్ గా  ఉన్న జె.సత్యనారాయణే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడిగా వ్యవహరించారని ఆ సెక్యూరిటీ రీసెర్చర్ చెప్పినట్లు జాతీయ న్యూస్ పోర్టల్ తన కథనంలో రాసుకొచ్చింది.ఓటర్ పేరు తొలగించే కుట్ర జరుగుతోంది ఇక ఓట్లను తొలగిస్తున్నారన్న ఫిర్యాదు అందగానే ఎన్నికల కమిషన్ కూడా వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఓంప్రకాష్ ద్వివేది చాలా ఓట్లు ఓటర్ జాబితానుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది నిజమేనని మీడియా సమావేశంలో చెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అంతేకాదు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు వినియోగించే ఫారమ్-7 చాలా వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ఫారమ్ -7 ఆధారం చేసుకుని ఓట్లు తొలగించబోమని... పూర్తి స్థాయిలో విచారణ చేసుకున్నాకే ఓట్లు తొలగించడం జరుగుతుందనే భరోసా ద్వివేది ఇచ్చారు.ఓటర్ల తొలగింపు కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల ముసుగులో చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాదు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు జాతీయ న్యూస్ పోర్టల్తో చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే గతేడాది కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో   భారీగా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందని తమ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకున్నట్లు జాతీయ న్యూస్ పోర్టల్ పేర్కొంది. గతేడాది తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 30 లక్షల ఓట్లు తొలగించడం జరిగిందని ఈ విషయం తమ ఇన్వెస్టిగేషన్లో తేలినట్లు తెలిపింది. ఓట్లు తొలగించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నట్లు ఆ న్యూస్ పోర్టల్ తన కథనంలో వెల్లడించింది.మొత్తానికి అధికారంలో ఉన్న పార్టీలు పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారం ఎలా దొంగలించవచ్చో అనేదానికి ఇదొక నిదర్శనమంటూ తన కథనాన్ని ముగించింది ఆ జాతీయ న్యూస్ పోర్టల్. ఏపీలో అధికార టీడీపీ పార్టీపై ఓట్లు తొలగిస్తోందంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.