గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలకు బిగిస్తున్న ఉచ్చు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలకు బిగిస్తున్న ఉచ్చు

కడప, మార్చి 20, (way2newstv.com)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ అనుమానిస్తున్న ఆయన అనుచరులపై దృష్టిపెట్టింది. వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గంగిరెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి చేతులు కలిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులోని ఓ భూవివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రూ.125 కోట్ల సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ డీల్‌లో రూ.1.5 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తోంది. గత నాలుగు రోజులుగా గంగిరెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉంటే వివేకా హత్యకు ముందు పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లుగా పోలీసులు గుర్తించారు. 


గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలకు బిగిస్తున్న ఉచ్చు

హత్యకు వారం ముందు కూడా ‘బీ కేర్‌ఫుల్‌’ అంటూ వివేకాకు అజ్ఞాతవ్యక్తి మెసేజ్‌ పంపారు. ఆ మెసేజ్ పంపింది ఎవరు? ఎందుకు పంపారు? అన్న విషయంపై కూడా సిట్ కూపీ లాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న పరమేశ్వర్‌రెడ్డిని రాత్రి తిరుపతి ఆస్పత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరమేశ్వర్‌రెడ్డి భార్య, కుమారుడు అడ్డుకునేందుకు యత్నించగా సిట్‌ అధికారులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి పులివెందుల నుంచి అదృశ్యమయ్యారు. హ‌త్య వెనుక ఆర్ధిక లావాదేవీలు, భూముల వ్య‌వ‌హారం వాటి క్ర‌య‌విక్ర‌యాల పై సిట్ బృధం దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో మ‌రో సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వేముల మండ‌లం దుగ్గ‌న్న ప‌ల్లెకు చెందిన ఓ వ్య‌క్తికి, వివేకానంద‌రెడ్డి ఆస్తుల‌కు సంబంధించి ప‌వ‌ర్ ఆఫ్ అటార్ణీ ఉన్న‌ట్లు సిట్ ద‌ర్యాప్తులో తేలింది. అత‌నే వివేకాకు సంబంధించి ఆస్తుల విష‌యంలో క్ర‌య విక్ర‌యాల వ్య‌వ‌హారాలు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ క్ర‌మంలో వివేకానంద‌రెడ్డి పేరిట వేముల మండ‌లంలో ఉన్న ఆస్తి విక్ర‌యం వేంప‌ల్లి స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యంలో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు వేంప‌ల్లి స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యంలో విచార‌ణ మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో వివేకానంద‌రెడ్డి ఆస్థి తాలూకు క్ర‌య‌విక్ర‌యాల‌కు సంబంధించి డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక మ‌రోవైపు వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న పేరిట ఉన్న ప‌వ‌ర్ ఆఫ్ అటార్ణీ ర‌ద్దు అయిన‌ట్లేన‌ని స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యం తెలిపింది. దీంతో వివేకానంద‌రెడ్డి హ్య‌త్య కేసు రోజుకో మ‌లుపుతిరుగుతుంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.