చల్లని చూపు (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చల్లని చూపు (గుంటూరు)

గుంటూరు, మార్చి 8 (way2newstv.com):
పేదలకు దృష్టి లోపం లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఈ-నేత్ర కేంద్రాలు ఎంతో మందికి దృష్టి లోపాలను సవరించి చక్కని చూపును అందిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఈ-నేత్ర కేంద్రాలను 115 ఏర్పాటు చేయగా, జిల్లాలో ప్రభుత్వం అపోలో సంస్థతో కలిసి 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు వేలాది మంది వచ్చి కంటి పరీక్షలు చేయించుకుని ఉచితంగా కళ్లజోళ్లను సైతం పొందారు.
జిల్లాలో చిలకలూరిపేట, వినుకొండ, ప్రత్తిపాడు, గురజాల, పొన్నూరు, సత్తెనపల్లి, రేపల్లె, మాచర్ల, అమరావతి, వేమూరులలో ఏడాది క్రితం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో షుగర్‌, బీపీ ఉన్నవారికి కంటిలో జరిగే రుగ్మతలను ముందుగా ఫండస్‌ కెమెరాతో గుర్తించి దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించడం, కళ్లజోళ్ల నాణ్యతను పరీక్షించే లెన్సోమీటర్‌ పరికరాలను అందుబాటులో ఉంచి పరీక్షలు జరుపుతున్నారు. ఆటో రిఫ్రాక్టోమీటర్‌తో కంటి లోపాలను గుర్తించి దానికి అనుగుణంగా కళ్లజోళ్లను అందిస్తున్నారు. 


చల్లని చూపు (గుంటూరు)

ప్రాథమిక దశలోనే సమస్యలను గుర్తించి అంధత్వాన్ని నివారించడానికి కేంద్రాలు దోహదపడుతున్నాయి. శస్త్రచికిత్స అవసరమైన వారికి నిపుణులైన వైద్యులను పరీక్షించి అనంతరం ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు.
చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో ఉన్న కేంద్రంలో నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల ఉన్న పెదనందిపాడు, మార్టూరు, పర్చూరు తదితర ప్రాంతాలవారు కేంద్రాలకు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ఏడాది కాలంలో 6వేల మందిని పరీక్షించి 5వేల మంది వరకు కళ్లజోళ్లను ఉచితంగా అందజేశారు.  ఇలా జిల్లాలోని ప్రతి ఒక్క కేంద్రంలో కూడా రోజుకి 25 నుంచి 30 మంది కళ్ల పరీక్షలు చేయించుకుంటూ ఉచితంగా కళ్లజోళ్లను పొందుతున్నారు. శస్త్రచికిత్స అవసరమైనవారికి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పంపిస్తూ నిపుణులైన వైద్యులతో కంటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా పేదలకు ఎటువంటి  ఆర్థిక భారం లేకుండా కంటిచూపును పొందగలుగుతున్నారు. కంటి సమస్యలతో బాధపడేవారు  ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్‌ తీసుకుని కేంద్రాలకు వస్తే ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవచ్చు. నూతనంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తే మరింత మంది కేంద్రాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది.