కర్నూలు, మార్చి 19, (way2newstv.com)
రెండో ముంబయిగా ఖ్యాతి గడించిన అదోని నియోజకవర్గంలో ఎన్నికలు ఈ సారి టఫ్ ఫైట్‌గా సాగనున్నాయి. ఇప్పటికే మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మీనాక్షినాయుడు మళ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా..2004లో, 2014లో ఇక్కడ అదే మీనాక్షినాయుడిపై గెలిచిన సాయి ప్రసాద్‌రెడ్డి వైసీపీ నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. ఇక కొత్తగా జనసేన నుంచి మల్లికార్జునరావు కూడా బ్యాలెట్ పోరుకు కాలు దువ్వుతున్నాడు. మొత్తంగా ఇద్దరు పాత కాపుల మధ్యే పోరు ప్రధానంగా కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో ఉంటుందని చెప్పుకొస్తున్నారు.1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం మొదట ద్విసభ్య విధానంలో కొనసాగడం గమనార్హం. కాలక్రమంలో అది రద్దు కాబడింది. ఇక ఈ నియోజకవర్గానికి 13సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 7సార్లు కాంగ్రెస్ విజయం నమోదు చేసింది. ఇక ఆ తర్వాత 4సార్లు టీడీపీ, 2సార్లు స్వతంత్రులు, ఒకసారి పీఎస్‌పీ విజయం సాధించాయి. ఇక ప్రస్తుత అభ్యర్థుల విషయానికి వస్తే 1994, 1999, 2009లో మీనాక్షినాయుడు అదోని నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే టికెట్ ఖాయమైంది. ఇక గతంలో కాంగ్రెస్ నుంచి 2004లో, 2014లో వైసీపీ నుంచి సాయి ప్రసాద్‌రెడ్డి విజయం సాధించారు. మీనాక్షినాయుడుకు పార్టీలో తిరుగులేకుండా పోయింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఈ నియోజకవర్గంలో టీడీపీకి అన్నీ తానై నడిపిస్తున్నారు.
అందరి చూపు...ఆదోని వైపు
నియోజకవర్గ టీడీపీలో మీనాక్షినాయుడు తిరుగులేని శక్తిగా మారడంతో అసమ్మతి తోక ముడుస్తోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నాయకుడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడని ఆయనపై ప్రజల్లో సదాభిప్రాయం ఉండటం ఆయనకు కలసి వచ్చే అంశం. ఇక ఎన్నికలకు ఆయన ఎప్పటినుంచో సిద్ధమవుతూ వస్తున్నారు. పార్టీ నుంచి టికెట్ చింత ఆయనకు లేకపోవడమే అందుకు కారణం. ఇక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సాయిప్రసాద్‌రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారట. వైసీపీ అధికారంలో లేకపోవడంతో కొంత నిధుల మంజూరులో ఇబ్బందులు తలెత్తి అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగకపోవడంపై ఆయనలో కొంత ఆందోళన అయితే కనబడుతున్నా, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే గెలిపిస్తే మంత్రినవుతా అంటూ శ్రేణుల వద్ద చెప్పుకొస్తున్నారట.తన శాయశక్తులా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు ప్రయత్నించానని ప్రసాద్‌రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఆదోని ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా వర్ధిల్లింది. ప్రస్తుతమైతే ఆ పార్టీకి పెద్దగా ఆదరణ కనిపించకపోవడం గమనార్హం. ఇక ఆ పార్టీ నుంచి ఉమ్మిసాలెం పేరు వినబడుతోంది. నియోజకవర్గంలో 2లక్షల 24వేల పైచిలుకు ఓటర్లు ఉండగా ఇక్కడ మైనార్టీ, వాల్మీకులు ఆ తర్వాత స్వకుల పద్మశాలి, ఆర్యవైశ్య సామాజికవర్గ ఓటర్లు ప్రాధాన్యక్రమంలో బలంగా కనిపిస్తున్నారు. వీరిలో మైనార్టీ, వాల్మీకుల ఓట్లు అత్యంత కీలకమని చెప్పాలి. అందుకే ఇక్కడ అభ్యర్థులు మొదట వారి మద్దుతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.