పేరులోనే నిట్.... దారుణంగా టెంపరరీ ఉద్యోగుల పరిస్థితి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పేరులోనే నిట్.... దారుణంగా టెంపరరీ ఉద్యోగుల పరిస్థితి

వరంగల్, మార్చి 28, (way2newstv.com)
నిట్.... పేరులోనే ఎంతో ఘనంగా కన్పిస్తోంది. కానీ ఇక్కడ పనిచేసే దిన సరి వేతన కార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారిని రెగ్యులర్‌ చేయకపో వడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే ఎంతో ఆశతో విధులు నిర్వర్తిస్తూ పర్మినెంట్‌ కాకముందే 105 మంది విధుల్లోనే మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వారి ఆశలు నెరవేరక ముందే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక బతికున్న వారినైనా రెగ్యులర్‌ చేస్తారేమోననే కొండంత ఆశతో నిరీక్షిస్తున్నారు. నిట్‌లోని వివిధ విభాగాలు, కార్యాలయాల్లో సుమారు వందకు పైగా దినసరి వేతన కూలీలు పనులు చేస్తున్నారు. 20 ఏండ్ల నుంచి అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. అధిక సమయం కేటాయిస్తూ వెట్టిచాకిరీ చేస్తున్నారు. అధికారులు మాత్రం రెగ్యులర్‌ చేస్తామని మభ్యపెడుతూ ఏళ్లు గడుపుతూ పనులు మాత్రం చేయించుకుంటున్నారు. 


పేరులోనే నిట్.... దారుణంగా టెంపరరీ ఉద్యోగుల పరిస్థితి

అంతటితో ఆగకుండా పై అధికారులు అన్ని విభాగంలో ఇష్టానుసారంగా పనులు చేయించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 1989 నుంచి విధులు నిర్వహిస్తున్నామని, రెగ్యులర్‌ కాకపోవడంతో కుటుంబ పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని వివరిస్తున్నారు. తమ అనుభవం గతించిపోతున్నదని, శ్రమకు తగిన ఫలితం లభించడం లేదని, పర్మినెంట్‌ చేస్తే ఎన్నో బెనిఫిట్స్‌ అందేవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చివరకు వయస్సు మీదపడి దినసరి కూలీలుగానే రిటైర్‌ అవుతున్నామని తెలుపుతున్నారు. ఎంతో మంది నిట్‌ డైరెక్టర్లు తమను పర్మినెంట్‌ చేస్తామని హామీలిచ్చారే తప్ప ఎలాంటి శ్రద్ధ చూపలేదని వివరిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.60 వేల నెల వేతనం ఉండగా, డైలీ వేజర్లకు మాత్రం కేవలం రూ. 10వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక్కడి డైలీ వేజర్ల అంశంపై పై అధికారులకు సిఫారసు చేయకుండా మోసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ వయస్సు పైబడుతున్నందున ప్రస్తుత నిట్‌ డైరెక్టరైనా తమను పర్మినెంట్‌ చేసి బతుకుల్లో వెలుగులు నింపాలని దినసరి వేతన కూలీలు కోరుతున్నారు. అనేక విభాగాల్లో డైలీ వేజర్లు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వేతనం మాత్రం అతి తక్కువగా చెల్లిస్తున్నారు. గత డైరెక్టర్లు ఎంతో మంది హామీలిచ్చి నెరవేర్చలేదు. డైలీవేజర్లుగా రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత నిట్‌ డైరెక్టర్‌కు కూడా తమ సమస్యను విన్నవించాం. తమను పర్మినెంట్‌ చేసి ఆదుకోవాలని హామీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌  ఎండి జాఫర్‌ డిమాండ్ చేస్తున్నారు.