వైసీపీలో చేరిన పీవీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీలో చేరిన పీవీపీ

 విజయవాడ ఎంపీ సీటుపై జగన్ హామీ
హైదరాబాద్, మార్చి 13, (way2newstv.com)
ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న పీవీపీని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా పీవీపీకి విజయవాడ పార్లమెంట్ టికెట్ను ఇస్తారనీ, ఈ నెల 23న ఆయన నామినేషన్ వేస్తారని వైసీపీలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి అనుగుణంగానే బుధవారం ఉదయం ఆయన జగన్ను కలవడం, వైసీపీలో చేరడం జరిగిపోయాయి. ఇప్పటివరకు పీవీపీ ప్రత్యక్షంగా ఏ పార్టీలోనూ చేరలేదు. గత ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ను పొందేందుకు శతవిథాలా ప్రయత్నించారు. 


వైసీపీలో చేరిన పీవీపీ

కానీ ఆ ప్రయత్నాలు నెరవేరలేదు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. సడన్గా వైసీపీ కండువాతో ప్రత్యక్షమయ్యారు. విజయవాడ పార్లమెంట్ టికెట్పై జగన్ భరోసా ఇవ్వడం వల్లే.. ఆయన వైసీపీలో చేరారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
పీవీపీ 2014 ఎన్నికల్లోనే బెజవాడ ఎంపీ బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అప్పట్లో ఆయన వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ రాదని తేలిపోవడంతో తనకు సన్నిహితుడైన సినీ నటుడు పవన్ కల్యాణ్ సహకారంతో టీడీపీ టికెట్ కోసం పీవీపీ ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తాజాగా మళ్లీ ఆయన పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి దాసరి జైరమేష్ వైసీపీలో చేరే వరకు విజయవాడ పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థులు కరువయ్యారు. దాసరి జైరమేష్ పార్టీలో చేరగానే ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బెజవాడ పార్లమెంటు స్థానం నుంచి జైరమేష్ పోటీ చేస్తారని అంతా భావించారు. తాజా పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.