సర్కారీ స్కూళ్లకు పుస్తకాలు వచ్చేశాయ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సర్కారీ స్కూళ్లకు పుస్తకాలు వచ్చేశాయ్

కరీంనగర్,మార్చి 18, (way2newstv.com)
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. బడుల ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేలా విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే వేసవి సెలవుల్లో జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాలను సర్కారు బడులకు పంపిణీ చేయనున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి సెలవులు ఏప్రిల్‌ 13 నుంచే ప్రారంభమవడం, జూన్‌ 1న పాఠశాలలు తిరిగి పున:ప్రారంభమవుతాయి. గతేడాది మాదిరిగా నూతన విద్యా సంవత్సరంలో ముందస్తుగా పైతరగతులు ఉండబోవు. దీంతో పాఠశాలల ప్రారంభానికి ముందు బడులకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారుగత రెండేళ్ల కిందటి వరకు పాఠశాలలు ప్రారంభమైనా పుస్తకాలు సకాలంలో అందక విద్యార్థులు వాటి కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది. కాని గతేడాది నుంచి నిర్ణీత సమయంలోనే పంపిణీ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ గత వారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ పుస్తకాల గోదాంలకు పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. దాదాపు సగం మేర ఇప్పటికే గోదాంలకు చేరాయి. 


సర్కారీ స్కూళ్లకు పుస్తకాలు వచ్చేశాయ్

ఈ సారి ఉచిత పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా జిల్లా విద్యాశాఖ పుస్తకాలపై వరుస నెంబర్లను ముద్రించి పంపిణీ చేయనున్నారు. దీంతో పుస్తకాలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చేరకుండా అడ్డుకట్టపడే అవకాశముంది.వచ్చే విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలతో పాటు సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం కోసం 129 టైటిల్స్‌కు సంబంధించిన 3,35,580 పాఠ్యపుస్తకాలు అవసరమని రాష్ట్ర అధికారులకు ప్రతిపాదనలను పంపించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పంపిణీ చేయగా 11,533 పుస్తకాలు మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి 41 టైటిల్స్‌కు సంబంధించిన 1,74,080 పుస్తకాలు జిల్లాలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాంకు చేరాయి. మిగిలిన పుస్తకాలు కూడ వారం పది రోజుల్లో జిల్లాకు చేరనున్నాయి. అయితే డైస్‌ వివరాల్లోని విద్యార్థుల సంఖ్య ప్రకారం తెప్పిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ పేర్కొంటున్నా మరోవైపు డైస్‌ ప్రకారం జిల్లాలో ఎంతమంది ఉన్నారనే వివరాలను మాత్రం ఆశాఖ గోప్యంగా ఉంచడంలో అంతర్యం ఏంటన్నది ఉపాధ్యాయుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. రెండేళ్ల నుంచి డైస్‌లోని విద్యార్థుల వివరాల ప్రకారమే పుస్తకాలను పంపిణీ చేశారు. అయితే గతేడాది కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య తగ్గినా చాల పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు అందలేదన్నది జిల్లా విద్యాశాఖకు తెలియని విషయం కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే నూతన విద్యాసంవత్సరానికి తెప్పించిన పుస్తకాలు విద్యార్థులందరి చేతుల్లో ఉంటాయా లేదా అని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.సర్కారు బడుల్లోని విద్యార్థుల కోసం సరఫరా చేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాలో పక్కదారి పడుతున్నాయి.