నర్సాపురం నుంచి జనసేన ఎంపీగా నాగబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నర్సాపురం నుంచి జనసేన ఎంపీగా నాగబాబు

ఏలూరు, మార్చి 13 (way2newstv.com)
ప్రధాన పక్షాలను తలదన్నేలా జనసేన గోదావరి జిల్లాల్లో వ్యూహాన్ని రూపొందించిందా..? నరసాపురం లోక్‌సభ స్థానానికి పవన్‌ సోదరుడు నాగబాబును బరిలోకి దింపబోతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ జనసేన నేతలు నిజమేనని బదులిస్తున్నారు. తమ పురిటిగడ్డపై అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలని మొదటి నుంచి పవన్‌కల్యాణ్‌ ఆశ పడుతున్నారు. దీనికి తగ్గట్టు జిల్లాలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఆరా తీస్తూ వచ్చారు. ఒక దశలో తాను పశ్చిమ నుంచే పోటీ చేస్తానంటూ పరోక్ష ప్రకటనలు చేశారు. ఏలూరు నుంచి ఓటు హక్కును పొందారు. అంతకుముందు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చేసిన ప్రకటన మార్చుకున్నట్టే కనిపించింది. ఆ తరువాత ఈ ప్రస్తావన ఎక్కడా ఎత్తలేదు.


నర్సాపురం నుంచి జనసేన ఎంపీగా నాగబాబు

జనసేనలో అసలు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? పార్లమెంటుకా..? అసెంబ్లీకా..? అనేది సస్పెన్స్‌గా మిగిలింది. తాజాగా రాజకీయ ప్రస్తావనలో ఆయన సోదరుడు నాగబాబు పేరు ప్రతిపాదనలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జనసేన ముఖ్యనేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వాస్తవానికి నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగబోతున్నట్టు చాలాకాలం క్రితం ప్రచారం సాగింది. తన అన్న చిరంజీవి ఓటమి పొందిన పాలకొల్లులో తిరిగి పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో పవన్‌ ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి నాగబాబు బరిలోకి దిగితే, మిగతా అసెంబ్లీ స్థానాలపైనా దీని ప్రభావం పడుతుందని, పార్టీ ఆయా స్థానాల్లో సులువుగా గెలిచేందుకు వీలు ఉంటుందని, తద్వారా జనసేన సత్తాను ప్రదర్శించేందుకు కార్యకర్తలు సమరోత్సాహంతో ముందుకు కదులుతారని నేతలు పవన్‌కు వివరించినట్టు సమాచారం. గతంలో తమ కుటుంబానికి జరిగిన అవమానాలను జనసేన నుంచి గెలుపొంది తిప్పికొట్టాలనే భావనతో ఉన్నట్టు చెబుతున్నారు. అందుకనే నరసాపురం, పాలకొల్లు స్థానాల ప్రతిపాదన కొత్తగా పార్టీలో చర్చకు దారితీసింది. ఇదే తరుణంలో తమ సొంతూరు మొగల్తూరు నరసాపురం పరిధిలోనే ఉండడం పార్టీకి అనుకూలంగా ఉంటుందని తమకున్న అంచనాలను పవన్‌ చెవిన వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది