ఇస్లామాబాద్ మార్చ్ 28 (way2newstv.com)
గత నెల జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా దాడి వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని పేర్కొంటూ అందుకు సంబంధించిన నిర్దిష్ట ఆధారాలను భారత్.. పాక్‌కు అందించింది. వీటిపై తాజాగా పాక్ స్పందించింది. భారత్ ఇచ్చిన ఆధారాలపై తాము దర్యాప్తు జరిపామని, ఆ దేశం చెప్పిన ప్రాంతాల్లో అసలు ఉగ్ర శిబిరాలే లేవని చెబుతోంది. భారత్ కూడా వచ్చి చూస్తానంటే అందుకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అంటోంది.ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
భారత్ చెప్పిన ప్రాంతాల్లో అసలు ఉగ్ర శిబిరాలే లేవు
దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జైషే మహ్మద్ ముఠాకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో.. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్ ఇకనైనా వాటిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. పుల్వామా దాడిలో జైషే కుట్రను తెలిపే కీలక పత్రాలను ఫిబ్రవరి 27న భారత్.. దిల్లీలోని పాక్ తాత్కాలిక హైకమిషనర్‌కు అందించింది.ఈ పత్రాలు అందిన వెంటనే పాక్ ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని ఆ దేశ విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. చాలా మందిని అదుపులోకి తీసుకుని విచారించామని, సోషల్‌మీడియా ఖాతాలపై కూడా దర్యాప్తు జరిపామని పేర్కొంది. అయితే పుల్వామా దాడికి సంబంధించిన ఏ ఆధారాలు లభించలేదని వెల్లడించింది. ‘భారత్ ఇచ్చిన జాబితాలో 54 మంది అనుమానితులను విచారించాం. వారికి పుల్వామా దాడితో సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అంతేగాక.. భారత్ పేర్కొన్న 22 ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాం. అక్కడ ఎలాంటి ఉగ్ర శిబిరాలు లేవు. కావాలంటే మీరు కూడా ఈ ప్రాంతాలకు వచ్చి చూడొచ్చు. అందుకు అనుమతి ఇచ్చేందుకు పాక్ సుముఖంగా ఉంది’ అని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.