విజయనగరం, మార్చి 2 (way2newstv.com):
జిల్లాలో హుద్‌హుద్ ఇళ్ల కేటాయింపు ప్రహసనంగా మారుతోంది. 2014 అక్టోబరు 11న హుద్‌హుద్ తుపాను సంభవించింది. దీని ప్రభావంతో 1700 ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. వీటిలో 552 ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 2016లో వీరికి ఇళ్లు మంజూరయ్యాయి. గాజులరేగలో 120 మంది లబ్ధిదారులకు నిర్మాణాలు చేపట్టారు. వీటికి 2017 అక్టోబరులో సామూహిక గృహ ప్రవేశాల్లో భాగంగా గృహ సముదాయాలను మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, కలెక్టర్ వివేక్‌యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. లంకాపట్నంలో 432 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులోనే రహదారి విస్తరణలో దెబ్బతిన్న 134 మందికి పరిహారంగా ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. రెండు చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయంటూ అధికారులు చెబుతున్నా ఏ ఒక్క లబ్ధిదారునికి కేటాయింపు జరగలేదు. ఈ విషయమై శాఖాపరమైన సమీక్షలో అప్పటి కలెక్టర్ వివేక్‌యాదవ్ గృహనిర్మాణ శాఖ అధికారులను నిలదీశారు. లబ్ధిదారులకు కేటాయించకుండా తనతో ఎలా కొబ్బరికాయ కొట్టించారంటూ ప్రశ్నించారు. ఇళ్లు పంచుకున్నారు? అమ్మేసుకుంటున్నారంటూ సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గూడు... గోడు (విజయనగరం)
బాధితులకు కాకుండా ఇతరులకు ఇచ్చేందుకు భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు ప్రచారం రావడంతో విచారణకు ఆదేశించారు. తరువాత దీనిపై అప్పటి నుంచి నేటి వరకు ఎటువంటి కదలిక లేదు. ఈ నెల తొమ్మిదిన లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామని అధికారులు ప్రకటించారు. అర్హులైన పేదలందరికీ మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు వ్యతిరేకించారు.
హుద్‌హుద్ తుపాను సమయంలో దెబ్బతిన్న ఇళ్ల జాబితా ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పురపాలక సంఘం, రెవెన్యూ, గృహనిర్మాణశాఖ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. నిర్మాణాలు ఆలస్యమైనందున అధికారులు లబ్ధిదారుల ఎంపికపై దృష్టిసారించలేదు. నాలుగేళ్ల తరువాత ఎంపిక చేయడంతో వారి అర్హతపైనా విమర్శలు నెలకొన్నాయి. ఎంపికైన వారిలో చాలా మంది అనర్హులన్నట్లు ప్రచారం ఉంది. రాజకీయ సిఫార్సుల మేరకు కొందరిని అర్హులుగా చేర్చారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారి ఎంపిక కొన‘సాగు’తోందంటున్నారు. పురపాలక సంఘం, రెవెన్యూ యంత్రాంగం లబ్ధిదారులు వివరాలు అందజేస్తే కానీ గృహాలు మంజూరయ్యే పరిస్థితి లేదని గృహనిర్మాణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వార్డుల్లో నేతలు మంజూరు పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.161లు వసూలు చేసినట్లు లబ్ధిదారులు బాహాటంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు తమకు ఇళ్లు వచ్చినట్లు వార్డులో నేతలు సూచించడంతో అధికారులను సంప్రదిస్తున్నారు. జాబితాలో పేరు లేదంటూ అధికారులు వారికి బదులివ్వడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. విచారణ చేసి, న్యాయం చేయాలని కోరుతున్నారు.
Tags:
Andrapradeshnews