కరుణించని కల్యాణ లక్ష్మీ (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కరుణించని కల్యాణ లక్ష్మీ (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, మార్చి 9  (way2newstv.com): 
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలన్న సంకల్పంతో ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆ వర్గాల దరిచేరడం లేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో స్వీకరించిన వేలాది దరఖాస్తులకు ఇప్పటికీ మోక్షం లభించడం లేదు. తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులను పట్టించుకునేవారు లేక కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. మరోవైపు లబ్ధిదారులు నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది.
ఆదిలాబాద్‌ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. ఇందులో 467 పంచాయతీలు ఉండగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి కల్యాణలక్ష్మికి 4,146 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3053 మందికి చెక్కులు అందజేయగా 31 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 1062 మందికి నెలల తరబడి చెక్కులు అందడం లేదు. షాదిముబారక్‌ కింద 989 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 568 మందికి చెక్కులు అందజేయగా 17 తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 404 మందికి చెక్కులు అందలేదు. సాధారణంగా పెళ్లిల సీజన్‌ మార్చి నుంచి జూన్‌ వరకు ఉంటుంది. ఆ సమయంలో జిల్లాలో పెళ్లిళ్లు చేయించిన కుటుంబాల నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద మీసేవా కేంద్రాలల్లో లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. 


కరుణించని కల్యాణ లక్ష్మీ (ఆదిలాబాద్)

అక్కడి నుంచి మండల తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుంటాయి. వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్‌ పరిశీలన అనంతరం జిల్లా రెవెన్యూ కార్యాలయానికి చేరుతాయి. ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయాల నుంచే వెళ్లకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరుస ఎన్నికలు రావడం, భూదస్త్రాల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు నిమగ్నం కావడంతో దరఖాస్తుల పరిశీలనలో కొంత జాప్యమవుతోంది. పెళ్లి ఖర్చుల కోసం పెళ్లినాడే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందాలి. ఈ కానుక సకాలంలో లబ్ధిదారుల చేతికి రావడం లేదు. దరఖాస్తు చేసుకున్నవారు తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరో పక్క నిధుల కేటాయింపులు సక్రమంగా జరగకపోవడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఇన్నాళ్లు నిధుల కొరత సాకుతో నెట్టుకొచ్చారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఇప్పటికైనా దరఖాస్తుల పరిశీలన వేగం పెంచితేనే ఈ పథకానికి సార్థకత వస్తుంది.
కల్యాణ, షాదీముబారక్‌ పథకాల దరఖాస్తులను పరిశీలించడంలో జాప్యం చేస్తున్నారు. వివాహం చేసుకునే ఇరువురి ఫొటోలు, ఇతర ఆధారపత్రాలతో వీఆర్వో ధ్రువీకరించిన తర్వాత మీ సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేల పరిశీలనకు వెళ్లి వచ్చేసరికి నెలల సమయం పడుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆపై ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉండటంతో అంతులేని జాప్యమవుతోంది. తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులకు మోక్షం కలిగినా ఆర్డీవో కార్యాలయాల్లో జాప్యం చేయడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చివరగా ఎమ్మెల్యే పరిశీలించి ఆమోదముద్ర వేయడంలో ఆలస్యమవుతుందని బాధితులు పేర్కొంటున్నారు.
వరుసగా శాసనసభ, పంచాయతీ ఎన్నికలు పథకంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటివరకు నిధుల కేటాయింపులో సందిగ్ధం ఉండగా తాజాగా బడ్జెట్‌లో సముచితస్థానం కల్పించారు. దీంతో నిధుల కొరత తీరినట్లయింది. ప్రస్తుతం పార్లమెంటు, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దస్త్రాల ప్రక్షాళన పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికైనా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తేనే సాయం అందుతుంది. ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి.