పవన్ ఉత్తరాంధ్రనా...రాయలసీమా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ ఉత్తరాంధ్రనా...రాయలసీమా

విజయవాడ, మార్చి 14, (way2newstv.com)
ఏపీలో పోలింగ్‌కు ఇంకా నెల రోజుల గడువు కూడ లేకపోవడంతో  నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అంశంపై కసరత్తులో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. టీడీపీ 130 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపో, ఎల్లుండో ఆ జాబితా విడుదల చేయనుంది.మరోవైపు, మొత్తం జాబితాను ఒకేసారి విడుదల చేసేందుకు వైఎస్సార్‌సీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తామేనంటూ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న జనసేన ఇప్పటికే ఇద్దరు లోక్‌సభ అభ్యర్థుల జాబితాను వెల్లడించగా, త్వరలోనే అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయనుంది. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేనాని ప్రకటించారు. 


పవన్ ఉత్తరాంధ్రనా...రాయలసీమా

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.తొలుత అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించినా, ఏ నియోజకవర్గం నుంచి అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఏడాది క్రితం ఆయన ఉత్తరాంధ్రలోని ఏదో ఒక జిల్లా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత పవన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినా పోటీపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ ఇక్కడి నుంచే పోటీ చేస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు.కానీ ఆ తర్వాత పవన్ పోటీకి సంబంధించిన ఎలాంటి విషయమూ బయటకు రాలేదు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో పవన్ పోటీ చేసే స్థానంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. విశాఖ జిల్లా గాజువాక పేరు కూడా తెరపైకి వచ్చింది. పిఠాపురం లేదా విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే ఉత్కంఠకు త్వరలో తెరపడనుంది.