హంతకుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హంతకుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు

పాలకొల్లు మార్చి 23,(న్యూస్ పల్స్)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో జగన్‌ జుట్టు ఉందని, అందుకే ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు విమర్శించారు. లోటస్‌పాండ్‌లో ఉంటూ ఇద్దరూ కుట్రలు పన్నుతున్నారన్నారు. తనను చూసి రాజధానికి రైతులు భూములు ఇచ్చారని, అదే జగన్‌ను చూస్తే అసలు భూమి ఇచ్చేవారా? అని ప్రశ్నించారు.చివరికి అఫిడవిట్‌కు స్టాంప్‌ పేపర్లను కూడా జగన్‌ హైదరాబాద్‌లో కొన్నారని ఎద్దేవాచేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు.మోదీ, కేసీఆర్‌ కుమ్మక్కై మనపైకి వస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ హిట్లర్‌ మాదిరిగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కాపాడుకునే సత్తా ఉందన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో తనకు సంబంధం ఉందన్నట్టు వైకాపా నేతలు మాట్లాడటం మొదలు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.


హంతకుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు

తాము హత్యలు చేయబోమని.. హత్యలు చేసిన వారి గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామ రక్ష అన్నారు. 32 కేసులు పెట్టుకొని జగన్‌ ఏమీ ఎరగనట్టు నటిస్తున్నారని విమర్శించారు. జనసేన నేత లక్ష్మీనారాయణ ప్రజల్లో చైతన్యం తేవాలనుకుంటే.. జగన్‌ కేసులను బయటపెట్టాలన్నారు.  ‘‘దేశంలో ఎక్కడా లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కుటుంబ పెద్దగా బాధ్యతతో ప్రవర్తించా. పెద్ద కుమారుడిగా ఉంటానని చెప్పా. చేసి చూపించా. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడం నా బాధ్యత. కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఆంధ్రావాళ్లు ద్రోహులని ప్రచారం చేశారు. ఆస్తులను లాక్కుని ఇక్కడికి పంపించారు. ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు. అయినా సహించాం. తెలంగాణలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడున్నాయి? ఇక్కడ మేం కట్టిన ఇళ్లు చూడండి. రైతులకు తెలంగాణ లక్ష రూపాయలు చేస్తే మనం లక్షన్నర మాఫీ చేశాం. నాలుగో, ఐదో విడత రుణమాఫీ సొమ్మును ఎన్నికల్లోపు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కౌలు రైతులను కూడా ఆదుకుంటున్నాం. పేదల పెళ్లిళ్ల బాధ్యత కూడా తీసుకున్నా. రూ.5కే భోజనం అందిస్తున్నా’’ అని చెప్పారు.
‘‘మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ మనపై కక్ష గట్టారు. నాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని కేసీఆర్‌ అంటున్నారు. జగన్‌కు కేసీఆర్‌ వెయ్యి కోట్లు పంపించారు. అధికారంలో ఉన్న మన దగ్గర డబ్బులు లేవు. కానీ కోడికత్తి పార్టీ వద్ద పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. కేసీఆర్‌ చేతిలో జగన్‌ జుట్టు ఉంది. అందుకే లోటస్‌పాండ్‌లో ఉంటూ కేసీఆర్‌ ఏం చెబితే అది చేస్తున్నాడు. మొత్తం 31 కేసులు ఉన్నాయి. ఇలాంటి నాయకుడు మనకు కావాలా? తెలంగాణలో కేసీఆర్‌ 25 లక్షల ఓట్లు తీయించేశారు. దాన్నే జగన్‌కు నేర్పించారు. వివేకా హత్య జరిగితే అది గుండెపోటు అని ప్రచారం చేశారు. అప్పట్లో కోడికత్తి పేరుతో డ్రామా ఆడారు.. ఇప్పుడు ఈ హత్య కేసులోనూ అదే మాదిరిగా డ్రామాలు ఆడుతున్నారు. ఇన్ని కేసులు ఉన్న జగన్‌ ఏదో రోజు జైలుకు వెళ్లడం ఖాయం’’ అని చంద్రబాబు అన్నారు.