నంద్యాల నుంచి శిల్పా కొడుకుకే అవకాశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నంద్యాల నుంచి శిల్పా కొడుకుకే అవకాశం

కర్నూలు, మార్చి 9, (way2newstv.com)
నంద్యాల అసెంబ్లీ బరినుంచి మరో నేత వారసుడు రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. శిల్పా మోహన్ రెడ్డి తన తనయుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిని ఈదఫా ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ తో భేటీ సందర్భంగా టిక్కెట్ విషయంలో శిల్పా మోహన్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జగన్ ఈసారికి మీరే పోటీ చేయొచ్చు కదా? అని శిల్పాను అడిగినప్పటికీ, తాను ఇక పోటీ చేయబోనని, తన కుమారుడినే బరిలోకి దించుతానని చెప్పినట్లు సమాచారం.ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైసీపీలో చేరిన వెంటనే నంద్యాల ఉప ఎన్నిక టిక్కెట్ ను జగన్ శిల్పాకు కన్ఫర్మ్ చేశారు. ఆ ఎన్నికల్లో హోరా హోరీగా పోరాడిన శిల్పా మోహన్ రెడ్డి యువకుడు, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ ఓటమిని శిల్పా జీర్ణించుకోలేకపోతున్నారు. 


నంద్యాల నుంచి శిల్పా కొడుకుకే అవకాశం

తాను నంద్యాల ప్రజలకు ఎంత సేవచేసినా తనను ఆదరించలేదని ఆయన ఒక దశలో కంటతడి కూడా పెట్టుకున్నారు.అయితే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగానే శిల్పా మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో శిల్పా రవి రెడ్డి పాల్గొన్నారు. తండ్రిని గెలిపించుకునేందుకు ఆయన తొలిసారిగా అప్పట్లో రాజకీయ క్షేత్రంలోకి దిగారు. శిల్పా రవి రెడ్డి అంతకు ముందు రాజకీయాల జోలికి వచ్చే వారు కాదు. ఆయన హైదరాబాద్ లోనే ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఓటమి పాలయిన శిల్పా మోహన్ రెడ్డి తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. అందువల్లనే ఆయన మరోసారి పోటీకి విముఖత చూపుతున్నారు.జగన్ కూడా శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం వైఎస్సార్సీ నంద్యాల ఇన్ ఛార్జిగా రవి వ్యవహరిస్తున్నారు. గత ఏడాదిగా ఆయన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తల సమస్యపై స్పందిస్తున్నారు. నంద్యాల టిక్కెట్ ఎవరికి అనేది తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ తేలకుండా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి ఉండటంతో ఆయనకు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎవీ సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి పోటీ పడుతుండటంతో ఈ టిక్కెట్ ను ప్రస్తుతం చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు. మొత్తం మీద నంద్యాల నుంచి యువనేత శిల్పా రవి టిక్కెట్ కన్ఫర్మ్ అవ్వడంతో ఆయన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.