అటకెక్కిన సోలార్ పవర్ (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అటకెక్కిన సోలార్ పవర్ (ఖమ్మం)

ఖమ్మం, మార్చి 7  (way2newstv.com):
 గిరిజన ఆశ్రమ పాఠశాలలు,  హాస్టళ్లలో విద్యుత్ కొతర నివారణకు ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు తొలగించడం, కరెంటు కోత, చలికాలంలో విద్యార్థులకు చన్నీళ్ల స్నానం నుంచి విముక్తి కలిగించడం , డిజిటల్‌ తరగతులు, సౌర విద్యుత్తు దీపాలు వంటి బహుళ ప్రయోజనాలతో వీటిని ఏర్పాటు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలలో ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్తు పరికరాలు నిరుపయోగంగా మారిపోయాయి. ఖమ్మం జిల్లా కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో అధిక సంఖ్యలో వీటిని నెలకొల్పారు. ప్రస్తుతం వీటిలో ఎక్కువ శాతం పని చేయడంలేదు. చాలాచోట్ల 01 కేడబ్ల్యూపీ సామర్ధ్యం ఉన్న వాటినే  అమర్చారు. వీటి వ్యయం సుమారు రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల భవనాల పైకప్పులో.. ఎక్కువ శాతం సోలార్‌ పరికరాలు బిగించారు. వీటి నుంచి విద్యుత్తు పరికరాలకు అనుసంధానం చేశారు. బిగింపుల అనంతరం చాలాచోట్ల బాగానే పని చేశాయి. అనంతరం మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఏర్పాటు చేసిన సంస్థకు అయిదేళ్ల నిర్వహణ బాధ్యత కూడా అప్పగించడంతో సమస్యలు లేకుండాపోయాయి. 


 అటకెక్కిన సోలార్ పవర్ (ఖమ్మం)

ఎక్కడైనా సమస్య ఎదురైతే బాధ్యులు వచ్చి మరమ్మతులు చేసి వెళ్లిపోయేవారు. కానీ కొంతకాలంగా మరమ్మతులు నోచుకున్న చోట పరికరాలు మూలనపడుతున్నాయి. సంబంధిత అధికారులు, సిబ్బంది మరమ్మతుల కోసం ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండాపోయింది. క్షేత్రస్థాయిలోని సమస్యను ఉప సంచాలకుల దృష్టికి తీసుకువెళ్లామని అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఇదేక్రమంలో విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తోంది.
విద్యాలయాల్లో సౌరశక్తి విద్యుత్తు పథకాల నిర్వహణలోపం ప్రధాన సమస్యగా మారింది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలలో ఓ సంస్థ ఆధ్వర్యంలో అయిదేళ్ల కిందట  ఉభయ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఎక్కువ శాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటయ్యాయి. సదరు సంస్థకు అయిదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కాలపరిమితి ముగియడంతో సోలార్‌ సిస్టం పడకేసింది. మరమ్మతులకు ఎదురుచూడాల్సి వస్తోంది. ఆయా విద్యాలయాల్లో సోలార్‌ పరికరాలు అలంకారప్రాయంగా మారిపోయాయి.
కమిషనరేట్‌ నుంచే అన్నీ.. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలలో సౌరశక్తి పరికరాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్లు అప్పట్లో హైదరాబాద్‌లోని శాఖ కమిషనరేట్‌ నుంచే నిర్వహించారు. ఓ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. విద్యార్థుల సంఖ్యను అనుసరించి 01 కేడబ్ల్యూపీ, 02 కేడబ్ల్యూపీ ఏర్పాటు చేశారు. 90 శాతం కంటే ఎక్కువ చోట్ల 01 కేడబ్ల్యూపీ సోలార్‌ పరికరాలనే బిగించారు.