లక్నో, మార్చి 29, (way2newstv.com)
నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. అయిదేళ్ల పదవీ కాలంలో ప్రధాని మోదీకి తన సొంత నియోజకవర్గం వారణాసి పరిధిలోని ఏ ఒక్క గ్రామాన్నీ సందర్శించే సమయం దొరకలేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ఫైజాబాద్‌లో శుక్రవారం జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు.
మోడీకి వారణాశి వచ్చే టైమ్ లేదా
అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలన్నీ మోదీ తిరుగుతారు...కానీ ఆయనకు తన నియోజకవర్గంలోని ప్రజలను కలుసుకునే సమయం మాత్రం ఉండదని ఎద్దేవా చేశారు. మోదీ తీరు ప్రభుత్వ అభిమతానికి అద్దం పడుతోందని, ఆయన సర్కార్ సంపన్నులను మరింత సంపన్నులుగా చేయడంపై దృష్టి సారించిందని, పేదలను విస్మరించిందని ప్రియాంక ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఆమె ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక సర్కార్‌గా ఆమె అభివర్ణించారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సహా దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.