గులాబీలో గుబులు పుడుతున్న మండలి ఫలితాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గులాబీలో గుబులు పుడుతున్న మండలి ఫలితాలు

కరీంనగర్, మార్చి 28,(way2newstv.com)
శాసనమండలి ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌ను ఆలోచనలో పడేశాయి. రెండు ఉపాధ్యాయ స్థానాలు, ఒకటి పట్టభద్రుల నియోజక వర్గం.. వెరసి మూడింటిలోనూ ఆ పార్టీకి ప్రతికూల పవనాలు వీచాయి. ఈ మూడు నియోజకవర్గాల ఫలితాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా విదిత మవుతున్నది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు, వామపక్షాలకు బలముంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ పరోక్షంగా బలపరిచిన పూల రవీందర్‌.. టీఎస్‌ యూటీఎఫ్‌ అభ్యర్థి నర్సిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. దీన్నిబట్టి త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎంతో కొంత ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న విపక్ష పార్టీల్లో నర్సిరెడ్డి గెలుపు జోష్‌ నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతూ వస్తున్నది. అసెంబ్లీ, మండలి, పార్లమెంటు అనే దానితో నిమిత్తం లేకుండా కారు దూసుకెళుతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమైంది. 


గులాబీలో గుబులు పుడుతున్న మండలి ఫలితాలు

అయితే తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించటం టీఆర్‌ఎస్‌కు ఒకరకంగా ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన జీవన్‌రెడ్డి.. మూడు నెలలు తిరక్కముందే తన సత్తా చాటారు. ఇదే సమయంలో అదే నాలుగు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పరోక్ష అభ్యర్థి, మండలిలో చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకరరెడ్డి ఓడిపోవటం గమనార్హం. అయితే ఉపాధ్యాయ సంఘాలు, అభ్యర్థుల బలాబలాలతోపాటు ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన అంశాలు బలంగా ముందుకొచ్చాయి. వీటిలో ఒకటి ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్‌ కాగా రెండోది ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించకపోవటం. రెండో అంశం పట్టభద్రులను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించినా పాతూరి సుధాకర్‌రెడ్డి ఆ పార్టీలో ముఖ్యనేత. పీఆర్‌టీయూ కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సంఘం.
ఈ ఫలితాలతో గులాబీ పార్టీ పెద్దల్లో అంతర్మథనం మొదలైందని సమాచారం. ఎమ్మెల్సీ ఫలితాలను అటుంచితే.. ఈ ప్రభావాన్ని ఎంపీ ఎన్నికలపై పడకుండా చూసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా నియోజకవర్గాల బాధ్యులకు సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎదురుగాలి వీచిన జిల్లాలను ప్రత్యేకంగా దృష్టి సారించి మరింత పట్టుదలతో పని చేయాలంటూ ఆయన దిశా, నిర్దేశం చేశారు.