భోజనం సరే.. బిల్లులెక్కడ..? (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భోజనం సరే.. బిల్లులెక్కడ..? (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, మార్చి 7 (way2newstv.com): 
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు హాజరు శాతం పెంచేందుకు, వారికి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో విద్యార్థులకు అందించే గుడ్లు సంఖ్యను సైతం పెంచింది. గ్యాస్‌ కనెక్షన్లతో పాటు పప్పు, నూనె, బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న పథకం నిర్వాహకులకు నెలనెలా బిల్లులు అందించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏకంగా ఈసారి నాలుగు నెలలయినా బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలో 3,117 పాఠశాలల్లో 4,117 వంట ఏజెన్సీలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఏజెన్సీల్లో దాదాపు 6,500 మంది సభ్యులున్నారు. సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులకు వీరు రోజువారీ వంట చేసి వడ్డిస్తుంటారు. జిల్లావ్యాప్తంగా నెలకు రూ.1.25 కోట్ల మేరకు ఇందుకోసం ప్రభుత్వం బిల్లులుగా చెల్లిస్తుంది.భోజనం సరే.. బిల్లులెక్కడ..? (కృష్ణాజిల్లా)


ప్రస్తుతం నాలుగు నెలల పాటు బిల్లు బకాయిలు దాదాపు రూ.5 కోట్ల మేరకు పేరుకుపోయాయి. ఇటీవల వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఇస్తున్న గౌరవ వేతనం పెంచినట్లు ప్రకటించినా ఇప్పటి వరకు ఏవిధమైన వేతనం అందించలేదు.
గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.5.13 ఇచ్చేవారు. వారానికి మూడు కోడిగుడ్లు ప్రభుత్వమే  అందజేస్తుండటంతో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని రూ.4.13కు తగ్గించారు. అనంతరం కందిపప్పు, నూనె, వారానికి ఐదు కోడిగుడ్లు సరఫరా చేస్తుండడంతో ఒక విద్యార్థికి రూ.2.17 వంతున నిర్వాహకుల చెల్లిస్తున్నారు. అదే ఉన్నత పాఠశాలల్లో మొదట రూ.7.18 ఇవ్వగా.. ప్రస్తుతం రూ.3.24 చొప్పున అందిస్తున్నారు. ప్రభుత్వమే గుత్తేదారుల ద్వారా సరకులను అందజేస్తున్నా ఇతర ఖర్చులు పెరిగాయని, తమకు విద్యార్థికి చెల్లిస్తున్న నగదు తగ్గించడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు.నెలనెలా బిల్లులు అందకపోతుండటంతో దుకాణాల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. తద్వారా దుకాణ యజమానులు కొన్నిసార్లు అప్పులు ఇవ్వని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇంట్లో వస్తువులను తాకట్టు పెట్టి, వడ్డీ వ్యాపారులకు నుంచి వడ్డీకి మొత్తాలు తెచ్చిపెట్టాల్సిన పరిస్థితి వస్తోంది.  బిల్లులు సక్రమంగా నెలనెలా చెల్లిస్తే ఇబ్బందులు తప్పుతాయని కోరుతున్నారు.