బెజవాడలో ఎండలు మండుతున్నాయ్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెజవాడలో ఎండలు మండుతున్నాయ్...

విజయవాడ, మార్చి 8, (way2newstv.com)
ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్లాంటేనే భయమేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండల్లో వెళ్లే వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. వడదెబ్బ తగిలి తల్లడిల్లి సొమ్మసిల్లిపోవడం కన్నా సరైనా జాగ్రత్తలు తీసుకొని పనులు కానిస్తే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, చర్మం తన ఉష్ణసమతాస్థితి ధర్మాన్ని కోల్పోవడం, గాలిలో ఉన్న ఆక్సీజన్‌ శాతం తగ్గడం.. రక్తంలో ఆక్సీజన్‌ శాతం తగ్గడం మెదడుకు ప్రసారమయ్యే రక్తంలో తేడాలు రావడం వల్ల వడదెబ్బ తగులుతుంటుంది. సౌకర్యంగా ఉండే ప్రదేశంలో ఉండాలి. ఆనవసరంగా ఎండలో బయటకు వెళ్లొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లే వ్యక్తులు తలపై టోపీ, 
గొడుగు ధరించాలి. ఎండలో పని చేసే కూలీలు తల పాగా తప్పనిసరిగా ధరించాలి. మజ్జిగ, కొబ్బరినీరు, చల్లటి నీరు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం గంటలకు ఓసారి తీసుకోవాలి. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లో ఎండలో తిరగొద్దు. ప్రధానంగా వృద్ధులు ప్రతి అరగంటకు చల్లటి మజ్జిగ తాగడంతో పాటు తడి రుమాలుతో ఒళ్లంతా తుడుచుకోవాలి. 


 బెజవాడలో ఎండలు మండుతున్నాయ్...

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో లేనప్పుడు ఉప్పు, చెక్కర, నీరు తగిన నిష్పత్తిలో కలిపి తాగాలి. ఎండలో తప్పకుండా పని చేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు, రిక్షా కార్మికులు తలపాగా, గొడుగు, టోపీ ధరించడమే కాకుండా ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 02:30 గంటల వరకు పని చేయకపోతేనే మంచిది. వడదెబ్బ రాకుండా ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే ఎంతో ఉపశమనం కలగడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.. 
కర్బూజ పండ్లు తినడం వల్ల మనిషిలో నీటి శాతం పెరుగుతుంది. అందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఎండకు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తీసుకుంటే ఎంతో ఉపశమనం పొందుతాం. అలాగే నిమ్మరసంలో కొంత ఉప్పు, చెక్కర కలుపుకుని తీసుకుంటే ఎండ వేడిమిలో మనిషి కోల్పోయిన పొటాష్‌, క్యాల్షియం తిరిగి పొందవచ్చు.. కొబ్బరిబొండా తాగడం వల్ల మనిషిలో పొటాషియం శాతం పెరిగి శక్తి పెరుగుతుంది. ఎండలో తిరిగిన వెంటనే చల్లని నీరు తీసుకోకూడదు. రంగులు కలిపే శీతల పానీయాలను తీసుకోకూడదు. టీ, కాఫీలు తగ్గించాలి. కాటన్‌ తెల్లని, పలుచని, దుస్తులు మాత్రమే ధరించాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా 5 లీటర్ల నీరు తాగాలి. కూల్‌ డ్రింక్‌, ఐస్‌క్రీములు తినకూడదు. ఆయిల్‌ పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు. తాటి ముంజలు తినడం వల్ల ఎండవేడిమి నుంచి తట్టుకోవచ్చు. ఫ్రిజ్‌ల కన్నా మట్టి కుండలో నీటిని తాగడం మంచింది.
వడదెబ్బకు ప్రథమ చికిత్స
వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ప్రదేశానికి చేర్చాలి. శరీరాన్ని చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి. వడదెబ్బ తగిలిన వారికి ఉప్పు, చక్కెర కలిపిన చల్లటి నీళ్లు తాగించాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ కలిపిన నీటిని తాగించాలి. ప్రథమ చికిత్స చేసిన వెంటనే ఆస్పత్రికి తరలించాలి.
ఉష్ణోగ్రత పెరిగితే ఇలా చేయాలి...
ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉండటంతో చెమట రూపంలో నీళ్లు బయటికి పోతుంటాయి. దాంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. గొంతు ఆరిపోతుంటుంది. రోజుకు 4, 5 లీటర్ల ద్రవపదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట ఏసీ వాహనాలు, ఇళ్లలో చల్లటి ఫ్యాన్‌ గాలికి ఉండేలా చూసూకోవాలి.
ఎండ వేడితో నీరసం...
ఎండవేడితో అధిక రక్తపోటు, మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. నీరసానికి దూరంగా ఉండేందుకు మాంసాహారం, ఉప్పు, మాసాలాలు తగ్గించి డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. బీరకాయ, సోరకాయ, దోసకాయ వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.