ఏలూరు, మార్చి 22, (way2newstv.com)
ఒకప్పుడు డాలర్ల పంట...నేడు అదే భారమైన పంటగా మారింది. రైతులకు కనకవర్షం కురిపించిన రొయ్య నేడు ధర పతనమై అదే రైతుల్ని నష్టాల ఊబిలో ముంచుతోంది. ఆక్వా కేపిటల్‌గా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు, ఉండి, కాళ్ల, భీమవరం, పాలకోడేరు, నర్సాపురం, యలమంచిలి, పాలకొల్లు, మొగల్తూరు తదితర ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో రైతులు రొయ్యల సాగుచేస్తున్నారు. కాగా ప్రస్తుతం రొయ్య ధర ఒక్కసారిగా పడిపోవడం రైతుల్ని బెంబేలెత్తిస్తోంది. 30 కౌంట్ ధర కిలో రూ.470 నుంచి రూ.370కు చేరింది. దీనితో కిలోకు రూ.100 వరకు రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే టన్నుకు రూ.లక్ష వరకు నష్టాన్ని చవిచూస్తున్నారు. గతంలో టైగర్ రొయ్యలను రైతులు పండించేవారు. సాగు ఆశాజనకంగా లేకపోవడంతో దాని స్థానంలో వచ్చిన వనామి రొయ్య రైతులను నష్టాలనుంచి గట్టెక్కిస్తుండటంతో అనతికాలంలోనే ఈ రొయ్యకు డిమాండ్ పెరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వనామిసాగు కొనసాగుతోంది.
నష్టాల బాటలో రోయ్యల ధరలు
ఈ తరుణంలో గతంలో భారీ లాభాలను ఆర్జించిపెట్టిన వనామి ప్రస్తుతం ధర పతనమవ్వడంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ధర పతనమవ్వడం, చెరువుల లీజులు భారీగా పెరగడం, మందులు, మేతలు కూడా రైతులకు భారమవ్వడంతో భారీగా నష్టపోతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు సైతం మరింతగా ధరలు తగ్గించి కొనుగోలుచేయడంతో మరింత నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. వేల ఎకరాల్లో రొయ్య పట్టుబడికి సిద్ధంగా ఉన్న తరుణంలో అదునుచూసి వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారనే విమర్శలు కూడా వినపడ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో భారీగా వస్తున్న సరుకును చూసి ధరలు తగ్గించేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వనామి రొయ్యను పెంచడం కూడా గగనమయ్యే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భారీగా విదేశీ మారకాన్ని ప్రభుత్వానికి అందిస్తున్న ఆక్వా పట్ల ప్రభుత్వం దృష్టిసారించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆక్వా రంగాన్ని కూడా వ్యవసాయ రంగంగా గుర్తించి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటుచేయడం ద్వారా ఇలాంటి మార్కెట్ ఒడుదొడుకుల నష్టాలను తగ్గించవచ్చని పలువురు రైతులు చెబుతున్నారు.