ఎంపీ పదవికి కోడెల, ఎమ్మెల్యే పదవికి శివరామ్

గుంటూరు, మార్చి 6, (way2newstv.com)
రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓపేజీని సృష్టించుకుని తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి తిరుగులేని నేతగా నిలుస్తూ వస్తున్న ప్రస్తుత శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు హస్తినకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అరుసార్లు శాసనసభకు ఎన్నికైన డాక్టర్ కోడెల వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పార్లమెంటులో అడుగిడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తనయుడు డాక్టర్ శివరామ్‌ను నర్సరావుపేట లేక సత్తెనపల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు పంపించాలని నిర్ణయించినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీనికి అటు అధిష్టానం, ఇటు కేడర్ నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


ఎంపీ పదవికి కోడెల, ఎమ్మెల్యే పదవికి శివరామ్

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాగానే తండ్రి, తనయుల అభ్యర్థిత్వాలను ప్రకటించనున్నారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి గెలుపొందిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు అటు నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల సమాన అభివృద్ధికి బాటలు వేశారు. ఈ క్రమంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ జంట నియోజకవర్గాల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకునేలా కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు శివరామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి నిజమైన లబ్ధిదారులకు అందేలా చూస్తూ వచ్చారు. రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కేడర్, నాయకులు బలంగా ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలను పేద, బడుగు, బలహీనవర్గాల వారి దరికి చేర్చి పార్టీకి వారి ఆదరణ, అభిమానాలను దూరం కాకుండా చేయడంలో సఫలీకృతులయ్యారనే చెప్పొచ్చు. రెండు నెలల్లో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అటు కోడెలకు పార్లమెంటు, తనయుడికి శాసనసభ టిక్కెట్లు ఇచ్చినట్లయితే పార్టీని తిరిగి విజయపథంలో నడిపించేందుకు నేతలతో పాటు కార్యకర్తలు, యువత సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండవతరం నాయకులు రంగంలోకి దిగనున్న నేపథ్యంలో శివరామ్‌ను పోటీకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. మంత్రులు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ కరణం బలరామ్, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు, అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్‌లు తమ తనయులు, కుటుంబ సభ్యులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో శివరామ్ పోటీకి మార్గం సుగమం కానుంది
Previous Post Next Post