మార్చిలోనే మంటలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మార్చిలోనే మంటలు

ఖమ్మం, మార్చి 28, (way2newstv,com)
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మార్చి నెల మంటలు మండిస్తున్నది. వేసవి కాలం నేపథ్యంలో ఉదయం నుంచే సూర్య భగవానుడు భగభగమంటూ దూసుకువస్తున్నడు. దీంతో వారం రోజులుగా రెండు జిల్లాల పరిధిలో ఎండ తీవ్రరూపం దాల్చింది. వేసవి ఆరంభంలోనే  పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నమోదవగా.. ప్రస్తుత మార్చిలో 40 డిగ్రీల చేరువకు వచ్చింది. శుక్రవారం రెండు జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఖమ్మంలో కనిష్టం 25 డిగ్రీలుండగా, గరిష్టం 38 డిగ్రీలకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో కనిష్టం 24 డిగ్రీలుగా, గరిష్టం 40 డిగ్రీలుగా నమోదయింది. సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సైతం గరిష్టం 38 డిగ్రీలుగా రికార్డయింది. అత్యవసరమైతేనే జనం రోడ్లెక్కుతున్నరు. మిగతా అన్ని కార్యకలాపాలూ సాయంత్రానికి వాయిదా వేసుకుంటున్నరు.గ్రామాల్లో అయితే ఇంటికో చెట్టు, పచ్చని పొలాలు, రకరకాల పండ్ల తోటలు, మట్టి రహదారులు ఉండటం వల్ల ఎండ తీవ్రత కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ పట్టణాల్లో పరిస్థితి పూర్తి భిన్నం. ఉభయ జిల్లాల పరిధిలో ఖమ్మం, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు భద్రాచలం వంటి టెంపుల్ సిటీలున్నాయి. ప్రస్తుతం అవన్నీ కాంక్రీట్ జంగిల్స్‌గా మారాయి. అంతర్గత రహదారులన్నీ సిమెంట్, ఇసుక, కంకరతో నిండిపోయాయి. 


మార్చిలోనే మంటలు

అంతర్గత రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఫలితంగా రోడ్ల వెంబడి చెట్లను నరికి వేసిన ఫలితంగా ఎండ ప్రభావం అత్యధికంగా కనిపిస్తున్నది. వేల సంఖ్యలో ఉన్నటువంటి మోటార్ సైకిల్స్, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు వంటి వాహనాలు రోజంతా వెదజల్లుతున్న కాలుష్యం కూడా అత్యధిక ఉష్ణోగ్రతల నమోదుకు కారణం అవుతున్నది. దీంతో మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూను తలపిస్తున్నాయి. కోల్‌బెల్ట్ విషయానికి వస్తే ఖమ్మం జిల్లా పరిధిలోని సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవటంతో జనం విలవిల్లాడుతున్నరుపట్టణాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారగా.. గ్రామీణ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం పేరుతో అడవుల నరికివేత, బీడు భూముల్లోని భారీ చెట్లను నరికివేస్తున్న కారణంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తున్నది. వారం రోజుల నుంచి ఉభయ జిల్లాలకు చెందిన గ్రామాల్లో వ్యవసాయం, ఉపాధిహామీ వంటి పనులన్నీ ఒక్కపూటకే పరిమితం అయ్యాయి. ఉదయం ఏడు గంటలకు రైతుల పొలాలకు, ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పనులకు వెళుతున్న కూలీలు మధ్యాహ్నం 12 గంటలకే ఇంటి బాటపడుతున్నరు.వేసవి కాలం సీజన్ ముదిరి పాకానపడటంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నవి. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పరిస్థితులు ఈ విధంగా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఏ విధంగా బాధిస్తాయోనని ఊహించుకుంటున్న ప్రజలు బెంబేలెత్తుతున్నరు. ఆ రెండు నెలల్లో యాబై డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదుకావటం ఖాయమని వాతావరణ నిఫుణులు హెచ్చరిస్తున్నరు. మనుషులు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల సాయంతో ఊరటపొందే అవకాశం ఉన్నప్పటికీ మూగ జీవాల మనుగడ కష్టమేనని వారు హెచ్చరిస్తున్నరు. కాగా వేసవి కారణంగా పట్టణాల్లో శీతల పానీయాలు, పండ్ల రసాలు, కొబ్భరి బొండాల వ్యాపాపాలు ఊపందుకున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటికి వస్తున్న ప్రజలు నిమ్మరసం, చెరుకు రసం, రకరకాల పండ్ల రసాలతోపాటు శీతల పానీయాలను సేవించి ఊరట చెందుతున్నరు. పుచ్చకాయల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.