మాజీ ఎంపీ వివేక్
హైదరాబాద్, మార్చ్ 25 (way2newstv.com)
ఒక ప్లాన్ ప్రకారమే నేనే పోటీచేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరిక్షణంలో టికెట్ నిరాకరించారు. ఇప్పుడు ఆయన ఆటబొమ్మలు కొందరు నామీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయిందని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. ఈ మేరకు అయన సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. నా తండ్రి కాకా, నేను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశాం. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చాను. తెలంగాణ కోసం పనిచేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమాఅని ప్రశ్నించారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేయడానికి పనిచేయడమే నేను చేసిన ద్రోహమా? 2014లో టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలే ఉంటే నేను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే నేను చేసిన ద్రోహమా? తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టారని అయన అన్నారు.
పధకం ప్రకారం పక్కన పెట్టారు
టికెట్ హామీ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసిన ద్రోహం కావచ్చు. నా ప్రజలకు నన్ను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయనివాళ్లకు టికెట్లిచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కనబెట్టారు. తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినవాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోంది. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వపోకడలను ప్రజల మీద రుద్ధుతున్నారు. ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తారని అయన పేర్కోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా కూడా సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటా. కష్టకాలంలో తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు.