ఆసక్తికరంగా విశాఖ ఎంపీ సీటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆసక్తికరంగా విశాఖ ఎంపీ సీటు

విశాఖపట్టణం, మార్చి 22, (way2newstv.com)
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం. ఇక్కడి నుంచి పార్లమెంటుకు మహామహులు ప్రాతినిథ్యం వహించారు. తెన్నేటి విశ్వనాథం, పీవీజీ రాజు, భాట్టం శ్రీరామ్మూర్తి, కొమ్మూరు అప్పలస్వామి, ఉమాగజపతిరాజు, ద్రోణంరాజు సత్యనారాయణ, ఎంవీవీఎస్‌ మూర్తి, టి.సుబ్బిరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి వంటి వారు ఇక్కడి నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. తాజాగా కంభంపాటి హరిబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా రాజకీయ నేపథ్యం కలిగి అనుభవం సాధించాక ఎన్నికైనవారే. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీకి దిగుతున్న ముగ్గురూ రాజకీయాలకు కొత్తవారే. తొలిసారిగా ఇక్కడ నుంచే పోటీ.. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థి మతుకుమల్లి శ్రీభరత్‌. విద్యావంతుడు. విదేశాల్లో చదువుకున్నారు. గీతం విద్యా సంస్థల బాధ్యతలు ఇటీవలె స్వీకరించారు.


ఆసక్తికరంగా విశాఖ ఎంపీ సీటు

తాతల నుంచి రాజకీయ వారసత్వం అందుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, పార్లమెంటులో వాణి వినిపించాలని గట్టిగా విశ్వసించే శ్రీభరత్‌ అనేక అడ్డంకులు అధిగమించి, పోరాడి టిక్కెట్‌ సాధించుకున్నారు. ఈయన తాతయ్య ఎంవీవీఎస్‌ మూర్తి గతంలో విశాఖ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్‌. డిగ్రీ చదువుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన చదువు పూర్తయిన తరువాత కొంతకాలం కాంట్రాక్ట్‌లు చేశారు. ఆ తరువాత విశాఖపట్నం వచ్చి సొంతంగా భవన నిర్మాణ రంగంలో దిగారు. ఎంవీవీ బిల్డర్స్‌ పేరుతో నగరంలో ఎక్కువ సంఖ్యలో అపార్ట్‌మెంట్లు నిర్మించారు. అలాగే సినిమా రంగం అంటే ఆసక్తి. సొంతంగా కొన్ని సినిమాలు నిర్మించారు. కొన్నింటిలో గెస్ట్‌ రోల్‌, మరికొన్నింటిలో విలన్‌గా నటించారు. దాదాపు ఏడాది క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో చేరి విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు.విద్యావంతులు రావాలని... రాజకీయాల్లోకి విద్యావంతులు వస్తే దేశానికి మేలు జరుగుతుందనే భావనతో సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగు పెట్టారు. సొంతంగా ఒక పార్టీని పెట్టాలని భావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అది ఫలితాలు ఇవ్వదని గుర్తించి తటస్థంగా ఉండిపోయారు. జనసేన నుంచి ఆహ్వానం రావడంతో అందులో చేరారు. రాజకీయాల ద్వారా సమాజంలో మార్పు తేవాలనేది ఆయన ఆలోచన. పోటీ ఇది తొలిసారే అయినా రాజకీయాలను అధ్యయనం చేశారు.