ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో ఎన్నికల అధికారుల సమావేశం
హైదరాబాద్ మార్చ్ 12 (way2newstv.com)
ప్రస్తుతం జరుగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా రాజకీయపరమైన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను ముద్రిస్తే సంబంధిత ప్రింటర్లపై ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు. నేడు హైదరాబాద్ జిల్లాలోని ప్రింటర్ల యజమానులతో జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల నిబంధనలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, సిపిఆర్ఓ వెంకటరమణలు ఈ సమావేశాన్ని నిర్వహించారు.
అనుమతిలేనిదే ప్రచార సామాగ్రి ముద్రించరాదు
హైదరాబాద్ జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు, ఫ్లెక్స్ ప్రింటింగ్, పలు ఏజెన్సీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ క్రింది ఆదేశాలు జారీచేశారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే వివిధ పార్టీల అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏవిధమైన ప్రచార కరపత్రాలు, పోస్టర్లు ముద్రించినా వాటిపై తప్పనిసరిగా ముద్రించినవారి పేరు, ప్రింటర్ పేరు, మొబైల్ నెంబర్, మొత్తం సంఖ్య తదితర వివరాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందని ఎన్నికల వ్యయ నోడల్ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి తెలియజేశారు. ఈ విషయంలో ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే సంబంధిత ప్రింటర్‌కు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 - 127 ఎ ప్రకారం ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 2వేల నగదు జరిమానాను విధించడం జరుగుతుందని పేర్కొన్నారు.