కరీంనగర్, మార్చి 29 (way2newstv.com)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ..లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచూపాలని భావిస్తోంది. ఈ క్రమంలో పలు కీలక నేతలను పార్టీలో చేర్చుకొని గెలుపుపై కన్నేసింది. ముఖ్యంగా సికింద్రాబాద్, చేవేళ్ల, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. వీటిలో కరీంనగర్ స్థానం కీలకమైంది. అక్కడి నుంచి బీజేపీ తరపున బండి సంజయ్ బరిలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినప్పటికీ మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. స్థానిక రాజకీయాలపై పట్టు ఉండడంతో పాటు ప్రజల్లో కలిసిపోయే నేత కావడంతో మరోసారి అవకాశమిచ్చింది. బండి సంజయ్ కుమార్ 1971లో జన్మించారు. శకుంతల-బండి నర్సయ్య ఆయన తల్లిదండ్రులు. భార్య అపర్ణ ఇద్దరు పిల్లులు ఉన్నారు. బండి సంజయ్ బాల్యం నుంచే స్వయం సేవకుడిగా పనిచేశారు. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 1994-2003 మధ్యకాలంలో ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పనిచేశారు.
ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గానూ సేవలందించారు. ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు.కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ మూడుసార్లు గెలిచారు. వరుసగా రెండు పర్యాయాలు నగర బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి..52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిల్చున్నారు. 2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి తానంటో నిరూపించుకున్నారు. రాష్ట్రంలో పోటీ చేసిన బిజెపి అభ్యర్థుల్లో బండి సంజయ్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. సంజయ్ పోటీచేస్తున్న కరీంనగర్‌లో బీజేపీ గతంలో రెండుసార్లు గెలిచిచింది. 1998-99, 1999-04 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి సీహెచ్ విద్యాసాగర్ రావు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. సంస్థాగతంగా ఇక్కడ బీజేపీకి పట్టుండడం..స్థానికంగా బండి సంజయ్‌కు మంచి పేరు ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. స్థానిక యువతతో కలిసిపోయి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారని ఆయనకు పేరుంది. ఐతే కరీంనగర్‌లో టీఆర్ఎస్ తరపున వినోద్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీచేస్తున్నారు. మరి బలమైన ఆ ఇద్దరు నేతలను ఢీకొట్టి బండి సంజయ్ విజయం సాధిస్తారో లేదో చూడాలి.