ఖమ్మం ఏప్రిల్ 12 (way2newstv.com)
భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే అంకురారోపణం జరపగా, 14న శ్రీసీతారాముల కల్యాణం, 15న శ్రీరామపట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. కల్యాణం, పట్టాభిషేకం నిర్వహించే మిథిలా ప్రాంగణాన్ని చలువ పందిళ్లతో, చాందినీ వస్ర్తాలతో అందంగా ఏర్పాటు చేశారు. భక్తులు ఈ వేడుకలను కనులారా తిలకించేందుకు వీలుగా కల్యాణ మండప ప్రాంగణాన్ని సెక్టార్ల వారీగా విభజించారు. వీవీఐపీ, వీఐపీ, ఇతర టికెట్లను సైతం దేవస్థానం విక్రయించింది. రామాలయం పరిసరాలలో చలువ పందిళ్లను ఏర్పాటు చేసి చాందినీ వస్ర్తాలను అలంకరింప చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు సేద తీరేందుకు వీలుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో తాత్కాలిక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి తీర ప్రాంతంలో సైతం చలువ పందిళ్లను నిర్మించారు. ఆలయ పరిసరాల్లో కరకట్ట రామాయణ రమణీయ దృశ్యాలతో ఉన్న విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. రామాలయాన్ని విద్యుద్దీపాలంకరణ గావించారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లల్లో స్వాగత ద్వారాలను నిర్మించారు.
14న కళ్యాణానికి అంతా సిద్ధం
కల్యాణాన్ని భక్తులు తిలకించే విధంగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, కల్యాణ వ్యాఖ్యానాన్ని వినేందుకు వీలుగా మైక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులరాకను దృష్టిలో ఉంచుకొని 2లక్షల లడ్డూ ప్రసాదాలను దేవస్థానం సిద్ధం చేస్తోంది. కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేసేందుకు ప్రత్యేక కౌంటర్లను నెలకొల్పారు. ఆర్‌టీసీ బస్సుల్లో సైతం కల్యాణ తలంబ్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి మహోత్సవానికి 685 ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడిపేందుకు ఆర్‌టీసీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. శ్రీరామనవమి ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్‌పీ సునిల్‌దత్, భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా, భద్రాచలం ఏఎస్‌పీ రాజేష్‌చంద్ర, దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలతతో పాటు వివిధశాఖల అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో పారిశుధ్యం మెరుగుదలకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ మహోత్సవాలకు పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో బుధవారం ఉదయం పవిత్ర గోదావరి నదీతీరం నుంచి తీర్ధబిందెను తీసుకొచ్చి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు నవ కలశ స్నపనం గావించారు. దేవస్థానం అధికారులు ఆచార్య, బ్రహ్మ, రుత్వికులకు దీక్షా కంకణధారణ, వస్ర్తాలను అందజేశారు. మూల మూర్తులకు, ఉత్సవ మూర్తులకు, నిత్యకల్యాణ మూర్తులకు కంకణధారణ గావించారు. సాయంత్రం శ్రీసీతారామచంద్రస్వామి వారిని తాతగుడి సెంటర్ వద్దకు తిరువీధిగా తీసుకెళ్లి అక్కడ పుట్టమట్టికి అర్చక స్వాములు ప్రత్యేకపూజలు జరిపారు. అంకురారోపణం, ద్వారా తోరణ పూజ, అఖండ దీపారాధన గావించారు.