ప్రాజెక్టులు సాకారం కావాలంటే 16 సీట్లు గెలవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రాజెక్టులు సాకారం కావాలంటే 16 సీట్లు గెలవాలి

సిద్ధిపేట, ఏప్రిల్ 02:(way2newstv.com)  
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అయ్యి  రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే మొత్తం 16 ఎంపీ సీట్లలో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నాయకులు కుర్ర సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1956 లొనే తెలంగాణ రాష్ట్రం పేర ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనత తమ ఎరుకల సంఘానిదని అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సమైక్య పాలనలో కుల వృత్తుల విధ్వంసం జరిగిందని అన్నారు. అసలు తెలంగాణ అంటేనే దరిద్రానికి చిహ్నంగా ఉమ్మడి పాలకులు తయారు చేశారని విమర్శించారు. అలాంటి రాష్ట్రంలో ప్రతి బీద కుటుంబంలో  సంతోషం ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు పడుతున్నారని కితాబునిచ్చారు. 


ప్రాజెక్టులు సాకారం కావాలంటే 16 సీట్లు గెలవాలి

కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతి, పేదవాడి కల అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ వంటి పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపు తున్నారని ప్రశంసించారు. తాను ఎమ్మెల్యే గా పని చేసినప్పుడు రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని శాసనసభలో ప్రశ్నిస్తే దానికోసం ఆత్మహత్యలు పెరుగుతాయని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారని అన్నారు. అలాంటిది స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత   రైతు బంధు పథకం, మరణించిన రైతు కుటుంబానికి ఐదు లక్షలు నష్టపరిహారాన్ని ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. దేశంలోనే రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు అందజేస్తున్న  ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని,రాష్ట్రంలో అన్ని కులవృత్తులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని అన్నారు. ముఖ్యంగా తమ ఎరుకల కులానికి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.హైదరాబాద్లో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘానికి ఒక ఎకరం స్థలం, కోటి రూపాయల నిధులను మంజూరు చేశారని విదేశీ విద్యా నిధి పథకం కింద ఎస్టీ అభ్యర్థులకు 20 లక్షల రూపాయలను ఇస్తున్నారని తెలిపారు. ఇలా  ప్రతి కుటుంబం కొరకు ఆలోచిస్తున్న వ్యక్తి కెసిఆర్ అని అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని యాచించకుండా శాసించేలా ఉండాలంటే రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను గెలిపించుకోవాలని ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెమ్మ సారం కృష్ణ,గౌరవ అధ్యక్షుడు కుతాడి రాములు, కూరాకుల వేణు, రాజు,భూపాల్, సాయి,బండి డాబులు తదితరులు పాల్గొన్నారు.