నిజామాబాద్, ఏప్రిల్ 2, (way2newstv.com
తెలంగాణలో ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలంటే.. గల్లీలో కాదు.. ఢిల్లీలో కూడా మన సర్కారే ఉండాలి.. మన గులాబీ జెండా ఉండాలే అని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీలతో ఇదే గులాబీ జెండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది. ఇప్పుడు 16 ఎంపీలు గెలిస్తే.. తెలంగాణ హక్కులను కాపాడుకోవచ్చు. ఎన్నికలు ఉన్నా లేకున్నా.. ఢిల్లీలో అయినా, గల్లీలో అయినా ప్రజల కోసం పని చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్‌ను గెలిపించాలి అని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. బోధన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఎంపీ కవిత పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్లో అన్ని సమస్యలపై మాట్లాడాను. నా శక్తి వంచన లేకుండా ఢిల్లీలో పని చేశాను.
16 మంది గెలిస్తే...చక్రం తిప్పొచ్చు
మన ఊరు - మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో పర్యటించాను. ఈ సందర్భంగా వచ్చిన వినతులను స్వీకరించి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్యలను పరిష్కరించాను. గల్లీలో ఉంటే సేవ చేసినం.. ఢిల్లీలో ఉంటే తెలంగాణ హక్కుల కోసం కొట్లాడినం. నా పని తీరు నచ్చితే మరోసారి గెలిపించండి. నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కనబడటం లేదు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జెండా ఎత్తేసి.. మా కార్యకర్తలంతా.. బీజేపీకే ఓటేస్తారని చెప్పిండంట. కొన్ని గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి రూ. 7 వేల కోట్లు ఇచ్చారు. మనం 16 ఎంపీ స్థానాలు గెలిస్తే పలు ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుకోవచ్చు అని ఆమె తెలిపారు.బోధన్ మండలం 42 గ్రామాలతో ఉన్న అతి పెద్ద మండలం. ఎన్నికల తర్వాత బోధన్ మండల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మండలంలోని అన్ని గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మంజీరా నది, పసుపు వాగు 365 రోజులు జలకళ సంతరించుకుంటుంది. నీళ్లు ఉంటే రైతులే కాదు.. ఊరు ఊరంతా బాగుంటుంది. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఈ ప్రభుత్వం.. ఇక్కడి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి మంచి రోజులు రాబోతున్నాయి. డ్వాక్రా గ్రూపుల వారికి లోన్లు వస్తున్నాయి. రైతులు పండించిన పంటను డ్వాక్రా గ్రూపు మహిళలు కొనాలి. ఆ తర్వాత వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మాలి. తద్వారా రైతులకు మద్దతు ధర వస్తుంది. కల్తీ లేని వస్తువులను అమ్మడం ద్వారా.. ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు.