30 ఏళ్ల మిత్రుల మథ్యే నెల్లూరు పోరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

30 ఏళ్ల మిత్రుల మథ్యే నెల్లూరు పోరు

నెల్లూరు, ఏప్రిల్ 1 (way2newstv.com)
నెల్లూరు అనగానే రాజకీయంగా ఎంతో చరిత్ర, పరిణతి కలిగిన ప్రాంతం. కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు కొదమసింహాల్లా తలపడే సింహపురి సమరం. ప్రస్తుత ఎన్నికల్లో సైతం నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది. మూడుదశాబ్దాల స్నేహ, ఆర్ధిక బంధాలను పక్కన పెట్టి గురు శిష్యులే సమరానికి సై అంటున్నారు. ఇంతకూ ఎవరా గురుశిష్యులు? నిన్నటి వరకూ ఒకరివెనుక ఒకరుగా తిరిగిన ఆ ఇద్దరూ ఒక్కసారిగా ఎందుకు ప్రత్యర్థులుగా మారారు? ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న మాట మన రాజకీయరంగానికి అతికినట్లు సరిపోతుంది ఎవరికి ఎవరు ఎందుకు ప్రత్యర్థిగా మారుతారన్నది కూడా నాటకీయంగా జరిగిపోతుంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకే విలక్షణమైనదిగా పేరుపొందిన నెల్లూరు స్థానం నుంచి జరిగే మహా సమరానికి గురుశిష్యులు సై అంటున్నారు. 


30 ఏళ్ల మిత్రుల మథ్యే నెల్లూరు పోరు 

ప్రస్తుత ఎన్నికల కోసం వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే వరకూ రాజకీయంగా, ఆర్థికంగా ఒకేమాట, ఒకేబాట అన్నట్లుగా సాగిన ఆదాల ప్రభాకరరెడ్డి, బీద మస్తాన్ రావు కొద్దిరోజుల వ్యవధిలోనే రాజకీయప్రత్యర్థులుగా మారిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదాల ప్రభాకర రెడ్డి అనూహ్యంగా వైసీపీ కండువా కప్పుకోడంతో నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ఆదాలను తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన అధికార టీడీపీ ఆ వెంటనే తేరుకొని ఆదాల అనుచరుడు బీద మస్తాన్ రావు ను తమ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా సంచలనమే సృష్టించింది. ఆదాల ప్రభాకర రెడ్డి, బీద మస్తాన్ రావు జోడీ రాజకీయంగా, వ్యాపారపరంగా నిన్నమొన్నటి వరకు గురుశిష్యులుగా ఉండేవారు. ఒకరు పార్టీలు మారుతున్న మరోకరు మాత్రం ఒకేపార్టీలో ఉన్నా వారిద్దరి మధ్య స్నేహబంధం.. పరస్పర అవగాహన గత మూడు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అంటూ వారిద్దరూ రాజకీయ ప్రత్యర్దులయ్యారు ఒకరు టీడీపీ నుంచి అనుహ్యంగా పార్లమెంట్ బరిలోకి దిగితే మరొకరు అధికార టీడీపీ నుంచి అధినేత ఆదేశానుసారం విధిలేని పరిస్తితుల్లో పోటీలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్ రావు తమ పార్టీ ఆవిర్భావం నుంచి ఓ సామాన్య కార్యకర్తగా తన జీవితం ప్రారంభించి ఎమ్మెల్యే స్థాయి నాయకుడిగా ఎదిగారు. కాగా టీడీపీ మాజీ, వైసీపీ ప్రస్తుత అభ్యర్థి ఆదాల ప్రభాకర రెడ్డికి ఓ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ అధినేతగా మంచి పేరుంది. 1994లో ఆదాలను రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత బీద సోదరులు మస్తాన్ రావు, రవిచంద్రలకు మాత్రమే దక్కుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి అల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ విజయం సాధించిన అనంతరం ఆయన రాష్టమంత్రిగానూ పనిచేశారు. ఆదాల రాజకీయంగా ఆరంగ్రేటం చేసినప్పటికీ వయసులో చిన్నవారైన మస్తాన్ రావు సోదరులు ఆదాలకు అనుచరులుగా కొనసాగారు. ఆదాలను వ్యాపార రాజకీయ రంగాల్లో తమ గురువుగా భావించారు. ఒకటి, రెండుసార్లు ఆదాల పార్టీ మారినా బీదా సోదరుల్లో పెద్దవారైన మస్తాన్ రావు మాత్రంఆదాలకు అనుచరుడుగానే కొనసాగుతూ వచ్చారు అయితే...ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం గురుశిష్యులే నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా మారారు. కొద్దివారాల క్రితం వరకూ టీడీపీలో కొనసాగిన ఆదాల ప్రబాకర్ రెడ్డి అనుహ్యంగా వైసీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీలో నిలబడ్డారు. అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఆదాల పార్టీ మారడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన టీడీపీ అంతలోనే తేరుకుని ఆదాల శిష్యుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావును తమ పార్టీ అభ్యర్దిగా బరిలోకి దించింది. దీంతో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో గురుశిష్యుల పోటీ అనివార్యమయ్యింది. ముపై ఏళ్ల రాజకీయాల్లో ఆదాల,బీదా ఇద్దరూ ఆర్థికంగా అపరకుబేరులయ్యారు. ఒకరు నిర్మాణ సంస్థ ఏపీఆర్ తో కోట్ల రూపాయలకు అధినేత కాగా, మరొకరు బిఎంఆర్ గ్రూప్ ఆప్ ఇండ్రస్టీస్ పేరుతో దేశమే కాదు ప్రపంచ స్థాయి ఆక్వారంగ నిపుణుడిగా, ఆర్థిక వేత్తగా ఎదిగారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నదానికి నిదర్శనమే ప్రస్తుత ఈ గురుశిష్యుల సమరం. సింహపురి సింహాల సమరంలో గెలుపెవ్వరిందో నిర్ణయించాల్సింది మాత్రం ఓటరు దేవుళ్లు మాత్రమే