చంద్రగిరిపై చంద్రబాబు గురి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రగిరిపై చంద్రబాబు గురి

తిరుపతి,  ఏప్రిల్ 1(way2newstv.com)
చంద్రబాబు సొంత నియోజకవర్గమది. అయినా గత ఇరవై ఏళ్ల నుంచి అక్కడ పసుపు జెండా ఎగరలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలో చంద్రబాబు ఉన్నారు. అక్కడి అభ్యర్థి ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేసి మాట్లాడేందుకు వెసులు బాటు కల్పించారు. అయితే ఈ నియోజకవర్గం ఇప్పుడు కాస్ట్ లీగా మారింది. గెలుపుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించేందుకు రెండు పార్టీల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునుపు ఆరు నెలల ముందు నుంచే ఇక్కడ అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారంటే నమ్మశక్యంగా ఉండకపోయినా ఇది నిజం. దాదాపు ఈ నియోజకవర్గంలో రెండు వందల కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ గెలుపు ఖచ్చితంగా ఉండాలని చంద్రబాబు నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో టీడీపీ ఉంది. ఇక్కడ గల్లాఅరుణకుమారి తాను పోటీ చేయనని చెప్పడంతో ఏడాది ముందుగానే చంద్రబాబు అభ్యర్థిని ఇక్కడ ప్రకటించడం విశేషం. పులివర్తి నానిని రంగంలోకి దించారు. 


చంద్రగిరిపై చంద్రబాబు గురి

అప్పటి నుంచి ఆయన జనంలోనే ఉన్నారు. ఎలాగైనా వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించాలన్న కసితో ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో చంద్రగిరి, తిరుపతి రూరల్, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టికల్లు, యర్రావారి పాలెం మండలాలు ఉన్నాయి జనవరి నుంచే ఓటర్లను ఆకట్టుకోవడాన్ని రెండు పార్టీల నేతలు ప్రారంభించారు.జనవరి ఒకటో తేదీన చంద్రగిరిలో అందరూ పండగ చేసుకున్నారు. కొత్త బట్టలతో పాటు మిఠాయి బాక్సులను పులివర్తి నాని ఇంటింటికి పంపిణీ చేశారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే వాల్ క్లాక్ లు, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఖర్చుకు వెనకాడటం లేదు. చంద్రగిరి ప్రజలు గత ఇరవై ఏళ్ల నుంచి సైకిల్ పార్టీని ఆదరించకపోవడంతో మరోసారి తనదే విజయమన్న ధీమాలో చెవిరెడ్డి ఉన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నందుకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, సొంత డబ్బులతో సమస్యలను పరిష్కరించానని ఆయన చెప్పుకుంటూ తిరుగుతున్నారు.టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సయితం ప్రజల్లోకి దూసుకు వెళుతున్నారు. ఎప్పటి కప్పుడు చంద్రబాబు నుంచి సలహాలు తీసుకుంటూ ఆయన ఎన్నికల వ్యూహాలను రచించుకుంటున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సయితం చంద్రగిరిలో టీడీపీ విజయానికి కృషి చేస్తున్నారు. ఆమె బరిలో లేకపోవడంతో కొంత ఆమె వర్గంలో అసంతృప్తి ఉన్నా బాబు ఆదేశాలను గల్లా అమల్లోకి పెట్టేశారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లోనే కాస్ట్ లీ నియోజకవర్గంగా చంద్రగిరికి ముద్రపడింది. పోరు మాత్రం హోరాహోరీగా సాగే అవకాశముంది. మరి చంద్రగిరి ప్రజలు ఈసారైనాచంద్రన్న పక్షాన నిలుస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.