యూపీలో కుటుంబ కధా చిత్రాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యూపీలో కుటుంబ కధా చిత్రాలు

లక్నో, ఏప్రిల్ 27, (way2newstv.com)
భారత రాజకీయాల్లో ‘‘కుటుంబం’’ అత్యంత కీలకం. రాజకీయాలకు, కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటినీ విడదీసి చూడలేం. కుటుంబ రాజకీయాలకు లేదా వారసత్వ రాజకీయాలకు మొదట్లోనే బీజం పడింది. నెహ్రూ నుంచి ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ… ఇలా వారసత్వ రాజకీయాలకు లేదా కుటుంబ రాజకీయాలకు ప్రతినిధులుగా నిలిచారు. ఇది జాతీయ స్థాయి ముఖచిత్రం. ఒక్క బీజేపీ, వామపక్షాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. అవి సిద్ధాంత ప్రాతిపదిక పార్టీలు కాబట్టి కొంత వరకూ మినహాయింపు ఉంది.ఇక రాష్ట్ర స్థాయిలో కుటుంబ రాజకీయాలకు కొదవలేదు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను తీసుకుంటే ఇక్కడ వారసత్వ రాజకీయాలు ఊడలు దిగాయి. కుటుంబాలు కీలకం. గతనాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తోంది. 


యూపీలో కుటుంబ కధా చిత్రాలు

ములాయం, ఆయన కుమారుడు, సోదరులు,ఇతర బంధువులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ములాయం కుటుంబానికి ఆయన కురువృద్ధుడిగా పేర్కొనవచ్చు. తాజా లోక్ సభ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు వివిధ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మెయిన్ పురి నుంచి ములాయం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 లో ఇక్కడి నుంచి ఎన్నికైన ములాయం కొద్దికాలానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన అన్న మనవడు తేజ్ ప్రతాప్ బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ ను 3.20 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో ఓడించారు. ఇప్పుడు ములాయం మళ్లీ స్వయంగా బరిలోకి దిగారు. ఆయనపై పాత ప్రత్యర్థి ప్రేమ్ సింగ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు.ములాయం కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం అజంఘడ్ నుంచి లోక్ సభ బరిలో ఉన్నారు. ఆయనపై భోజ్ పురి నటుడు దినేశ్ లాల్ యాదవ్ ను బీజేపీ బరిలోకి దించింది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో అఖిలేష్ ‘యశ్ భారతీ’ అవార్డును దినేష్ కు అందజేయడం గమనార్హం. ఇప్పుడు ఆయనే ప్రత్యర్థి. అయినప్పటికీ ఇక్కడ అఖిలేష్ విజయం సునాసాయమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ములాయం అన్న మనవడు సిట్టింగ్ ఎంపీ ధర్మేంద్ర మళ్లీ బదయాన్ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కూతురు సంఘమిత్ర బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఆమె మెయిన్ పురి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ తరుపున మాజీ ఎంపీ సలీం షేర్వాణీ రంగంలో ఉన్నారు. ఆయన 1996 నుంచి సమాజ్ వాదీ పార్టీ తరుపున మూడు సార్లు గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ లో చేరారు. ఫిరోజాబాద్ ప్రస్తుత ఎంపీ అక్షయ్ తండ్రి, ములాయంకు వరసకు సోదరుడైన రాంగోపాల్ 2014లో తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించడంలో విజయం సాధించారు. కానీ ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ తన కొడుకు ఆదిత్యకు ఫిరోజాబాద్ టిక్కెట్ వస్తుందని ఆశించారు. దీంతో తమ్ముడు, వరసకు తమ్ముడి మధ్య తేడాలు వచ్చాయి. సొంతంగా పార్టీ పెట్టిన శివపాల్ యాదవ్ ఇప్పుడు స్వయంగా ఫిరోజాబాద్ లో పోటీకి దిగారు. అక్షయ్ పై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా చంద్రసేన్ బరిలో ఉన్నారు. ఎస్పీ మద్దతుదారుల మధ్య ఓట్ల చీలిక బీజేపీకి కలసి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కనౌజ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గతంలో రెండు సార్లు గెలిచిన ఆమె మూడోసారి ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే నియోజకవర్గంలో గతంలో ములాయం ఒకసారి, అఖిలేష్ మూడుసార్లు గెలుపొందారు. ప్రస్తుతం డింపుల్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోటీ పెట్టలేదు. ములాయం తమ్ముడు శివపాల్ సింగ్ కూడా తమ పార్టీ అభ్యర్థిని నిలపలేదు. దీంతో ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ విజయం సనాయాసం కావాలి. కానీ ఆ పరిస్థితి లేదు. 2014లో డింపుల్ బీజేపీ అభ్యర్థిపై 19 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుబ్రత్ పాటక్ మళ్లీ అదే పార్టీ తరుపున బరిలోకి దిగారు. ఇక్కడ 18. 5 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో ముస్లింలు మూడు లక్షలు, యాదవులు 2.5 లక్షలు, దళితులు మూడు లక్షలు, బ్రాహ్మణులు 2 లక్షలమంది వరకూ ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి పాఠక్ ఎస్సీ అభ్యర్థి డింపుల్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సమాజ్ వాదీ పార్టీ ఈసారి తమ పార్టీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న అయిదు నియోజకవర్గాల్లో విజయం తమదేనన్న ధీమాతో ఉంది. బీఎస్పీ మద్దతు ఉన్నందున గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నా వారి ప్రభావం అంతంత మాత్రమే. మొత్తం మీద పోటీ రసవత్తరంగా మారింది. ఈ అయిదు నియోజకవర్గాల్లో ఒకరిద్దరినయినా ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో? ఎవరిది పై చేయి అవుతుందో? చూడాలి.