నెల్లూరు, ఏప్రిల్ 27, (way2newstv.com)
ఏపీలో ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడుస్తున్నా.. గెలుపోటములపై ఎవరూ కచ్చితంగా ఏదీ చెప్పలేని పరిస్ధితి. రాజకీయ పార్టీలు గెలుపు తమదంటే తమదంటూ బీరాలు పోతున్నా.. వారిలోనూ అంతర్గతంగా భయం కనిపిస్తోంది. ఈ ప్రభావం ఇప్పుడు బెట్టింగ్ లపైనా పడింది. బెట్టింగ్ కు ప్రధాన కేంద్రమైన భీమవరంలోనూ ఈసారి పందెం రాయుళ్లు స్తబ్ధుగా ఉన్నారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. కచ్చితమైన అంచనా లేకుండా డబ్బులు పెట్టి చేతులు కాల్చుకోవడం ఎందుకన్న వాదన ప్రతీ చోటా వినిపిస్తోంది. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలపై వేల కోట్లలో బెట్టింగ్ లు జరుగుతాయని అంతా ఆశించినా అంత సీన్ లేదనే పరిస్ధితి కనిపిస్తోంది. దానికి కారణం అభ్యర్ధుల గెలుపోటములపై ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. రాజకీయ పార్టీల్లో సైతం ఇదే గందరగోళం నెలకొంటోంది. అందుకే మరోసారి సర్వేలకు కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పుడు వీరిని చూసి బెట్టింగ్ రాయుళ్లు కూడా అయోమయానికి గురవుతున్నారు.
పైకి బీరాలు...లోపల భయాలు
ముందుగా పార్టీలు, అభ్యర్ధులపై బెట్టింగ్ రేట్లను కూడా నిర్ణయించుకుని ముందుకు దూకిన బెట్టింగ్ రాయుళ్లు.. ఇప్పుడు పార్టీల్లో గందరగోళాన్ని గమనించి పలు చోట్ల వెనక్కి తగ్గారు. ముఖ్యంగా బెట్టింగ్ కు ప్రధాన కేంద్రమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈసారి బెట్టింగ్ రాయుళ్లు గతంలో పోలిస్తే ఈసారి నెమ్మదించినట్లు తెలుస్తోంది. వీరిని చూసి ఇతర ప్రాంతాల్లో పందెం రాయుళ్లు కూడా ఇప్పుడు వ్యూహం మార్చుకుంటున్నారు.సరిగ్గా వారం క్రితం వైసీపీ గెలుపుపై ఏకపక్షంగా బెట్టింగ్ లకు సిద్ధపడ్డ వారంతా గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుందన్న వైసీపీ అంచనాలతో ప్రభావితం అయినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ సీటులో వైసీపీ అభ్యర్ధి కనుమూరి రఘురామకృష్ణంరాజు గెలుపు నల్లేరుపై నడకేనని భావించినా... పోలింగ్ సరళిని విశ్లేషిస్తే అదంత సులువు కాదని అర్ధమవుతోంది. అందుకే కాబోలు బెట్టింగ్ రాయుళ్లు సైతం వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. స్ధూలంగా గోదావరి జిల్లాల్లో జనసేన ఏమేరకు ఓట్లు చీల్చి ఉంటుందన్న అంశంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఆ మాటకొస్తే జనసేనకే క్లారిటీ లేదు.రాష్ట్రంలో గతంలో ప్రధాన పార్టీల నేతల గెలుపోటములపై, మెజారిటీలపై సాధారణంగా బెట్టింగ్ లు జరిగేవి. ఈసారి జనసేన రాకతో ఆ పార్టీ గెలిచే స్ధానాలు, అధినేత పవన్ గెలుపోటములు వంటి అంశాలు ఈసారి బెట్టింగ్ రాయుళ్లను ఊరిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు పందాలు కాయడం వల్ల నష్టపోతామన్న అంచనాలో బెట్టింగ్ రాయుళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మే నెల మొదటివారంలో నియోజకవర్గాల వారీగా నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు టీడీపీ నేతలను కోరిన నేపథ్యంలో ఆ తర్వాతే స్పష్టత వస్తుందన్న అంచనాల్లో బుకీలు ఉన్నారు. ఆ లోపు వైసీపీ వ్యూహాలను సైతం గమనించాక ఎన్నికల ఫలితాలకు వారం, పది రోజుల ముందు బెట్టింగ్ కు దిగాలని బుకీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తొందరపడటం కన్నా వేచి చూసే ధోరణి వల్లే ఎక్కువ లాభం ఉంటుందన్న అంచనాలో బుకీలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.పోలింగ్ తర్వాత సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న ధోరణితో సగం క్లారిటీ వచ్చినా, జనసేన రాకతో వైసీపీ అభ్యర్ధుల జయాపజయాలు ఆధారపడి ఉన్నందున బుకీలు ఆచితూచి స్పందిస్తున్నట్లు సమాచారం. మరో వారం రోజులు ఆగితే ఫలితాలపై మరింత స్పష్టత వస్తుంద్న అంచనా కూడా దీనికి మరో కారణంగా తెలుస్తోంది.