ఆలస్యం.. అమృతం.. విషం (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆలస్యం.. అమృతం.. విషం (కృష్ణాజిల్లా)

విజయవాడ, ఏప్రిల్ 22 (way2newstv.com): 
నగరంలో కీలకమైన ఫ్లై ఓవర్లనిర్మాణం కీలక దశకు చేరుకున్నాయి. అప్రోచ్‌ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తనున్నాయి. ఈ రెండు ఫ్లైఓవర్ల పనులు ప్రారంభమైనప్పుడు ఉత్పన్నమైన సమస్యలు మళ్లీ ఎదురుకానున్నాయి. దీనికితోడు బెంజిసర్కిల్‌ వంతెన రోడ్డు కోసం భూసేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా కాంట్రాక్ట్ సంస్థ అప్రోచ్‌ రోడ్ల గోడల నిర్మాణం చేపట్టింది. దీని వల్ల సర్వీసు రోడ్డు కుచించుకుపోయింది. ఫకీరుగూడెం, రమేష్‌ ఆస్పత్రి ప్రాంతాల్లో జాతీయ రహదారి ఇరుకుగా మారనుంది. రెండుచోట్ల ట్రాఫిక్‌ పరంగా ఇబ్బందులు తప్పడం లేదు. సమస్యలను కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. కనకదుర్గ పైవంతెనకు సంబంధించి రాజీవ్‌ పార్కు వద్ద అప్రోచ్‌ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణవేణి ఘాట్‌ వద్ద రోడ్డు ఇరుకుగా మారింది. సర్వీసు రోడ్లకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఇది పరోక్షంగా పనుల వేగంపై ప్రభావం చూపుతోంది. కీలకమైన ఈ అంశంపై ఎన్‌హెచ్‌ఏఐ దృష్టి సారించడం లేదు.


ఆలస్యం.. అమృతం.. విషం (కృష్ణాజిల్లా)

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో అప్రోచ్‌ రోడ్డు తప్ప అంతా పూర్తి అయింది. రెండు వైపులా ర్యాంపు పనులు జరుగుతున్నాయి. ఆర్‌ఈ వాల్స్‌ ను ఏర్పాటు చేశారు. నోవాటెల్‌ హోటల్, ఫకీర్‌గూడెం వద్ద వెంతెన కిందకు దిగుతుంది. ఈ ప్రాంతాల్లో భూసేకరణ ప్రారంభం కాలేదు. మార్కింగ్‌ మాత్రమే ఇచ్చి వదిలేశారు. దీని వల్ల రమేష్‌ ఆస్పత్రి నుంచి నోవాటెల్‌ హాటల్‌ వరకు ఉన్న సర్వీసు రోడ్డు ఇరుకుగా మారింది. ప్రస్తుతం కేవలం 7 మీటర్ల కంటే తక్కువకు తగ్గిపోయింది. ఒక వరుసలో వాహనాలు వెళ్లడమే కష్టంగా మారింది. ఈ రోడ్డు వెంబడి దాదాపు ఐదు వీధులకు.. ఇతర వాటితో అనుసంధానం లేదు. దీని వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తున్నాయి. తక్షణమే భూసేకరణ చేసి సర్వీసు రోడ్డును విస్తరించాల్సి ఉంది. ఫకీరుగూడెం వైపు కూడా ఇదే పరిస్థితి. అప్రోచ్‌ రోడ్ల కారణంగా ప్రధాన రహదారిపై కూడా చాలా ప్రాంతం పోనుంది. దాదాపు ఏడు అడుగుల మేర రోడ్డుపై అడ్డు పెట్టి పనులు చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైన రమేష్‌ ఆస్పత్రి, ఫకీరుగూడెం వద్ద ఇంత విస్తీర్ణం పోతే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పవు. ఒక్కోచోట 500 మీటర్ల మేర వాహనాలు స్తంభించే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా డివైడర్‌ను రెండు అడుగుల మేర కుదిస్తే.. ఆమేర జాగా కలసి వస్తుందని ట్రాఫిక్‌ పోలీసులు ఆలోచించారు. ఈ మేరకు సహకరించమని నగరపాలికకు విజ్ఞప్తి చేశారు. అటువైపు నుంచి ఇంకా స్పందన రాలేదు.  వివిధ రకాల తీగలు ఉన్నందున తవ్వితే కష్టమని వీఎంసీ అధికారులు నిరాకరించారు. ఈ ప్రతిపాదన ఆచరణలోకి రాకపోవడంతో స్క్రూ వంతెన, రమేష్‌ కూడలి వద్ద వాహనాలు కదలడం కష్టంగా మారుతోంది. ఫకీరుగూడెం జంక్షన్ వద్ద పటమటలంకలోకి వెళ్లడానికి రోడ్డుకు ఇరువైపులా అప్రోచ్‌ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ సర్వీసు రోడ్డు కోసం భూసేకరణ చేయకపోవడంతో ఇప్పుడున్న రోడ్డును వదిలి రెండు వైపులా ఆర్‌ఈ వాల్స్‌ లో మట్టిని నింపుతున్నారు. ఇక్కడ సర్వీసు రోడ్డు కనీసం ఒక మీటరు కూడా మిగల్లేదు. ఇటువైపు రాకపోకలు సాగించలేని పరిస్థితి. భూసేకరణ ఇంకా చేపట్టలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే ఏడు మీటర్ల మేర సర్వీసు రోడ్డు, 1.5 మీటర్ల డ్రైనేజి నిర్మించేందుకు ఆస్కారం ఉంటుంది. ఫకీరుగూడెం కూడలి మూసివేస్తే.. అవతలవైపు వారు సర్వీసు రోడ్డు నుంచి ఒకటో నెంబరు పిల్లరు పక్క నుంచి ప్రధాన రహదారిపైకి వాహనాలను పంపించే వీలు కలుగుతుంది. భూసేకరణ ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్దీ అప్రోచ్‌ రోడ్లు, పైవంతెన నిర్మాణ పనులు సాగవు. పైగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవు.ప్రకాశం బ్యారేజి నుంచి కుమ్మరిపాలెం వెళ్లే ప్రాంతంలోనూ ఇదే సమస్య తలెత్తుతోంది. అసలే ఇరుకు రోడ్డు దీనికి తోడు బ్లాక్‌ చేసి పనులు చేస్తుండటంతో గత సమస్యలు పునరావృతం అవుతున్నాయి. కుమ్మరిపాలెం, భవానీపురం మార్గంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మోడల్‌ అతిథిగృహం వద్ద పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆంక్షల కారణంగా వాహనాలు కదలడం కష్టంగా మారుతోంది. విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో వన్‌టౌన్‌ కీలకం. ప్రకాశం బ్యారేజి నుంచి భవానీపురం వరకు రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. కనకదుర్గ పైవంతెన కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి అవుతుందని చెప్పినా కాలేదు. నిర్మాణం ప్రారంభమై మూడేళ్లు అవుతోంది. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కనకదుర్గ పైవంతెన పనులు 2015 డిసెంబరులో మొదలయ్యాయి. పనులను గుత్తేదారు ఆలస్యంగా చేపడుతున్నారు. చేసేది లేక ప్రభుత్వం గుడువు పెంచుతూ పోతోంది. మోడల్‌ అతిథిగృహం, అశోక స్తంభం వద్ద రెండు పిల్లర్లను నిర్మించారు. వీటికి వింగ్స్‌ అమర్చాల్సి ఉంది. వీటిని గుత్తేదారు సంస్థ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పనులు మొదలైతే రెండు పిల్లర్ల వద్ద చాలా ప్రాంతం వరకు బ్లాక్‌ చేస్తే రోడ్డు ఇరుకిరుగా మారుతుంది. సీతమ్మ పాదాల వద్ద కనకదుర్గ పైవంతెన ర్యాంపు పనులు మొదలయ్యాయి. ఇక్కడ ఇప్పటికే రెండు అండర్‌పాస్‌లను నిర్మించారు. వీటి పైనుంచి రాజీవ్‌ పార్క్‌ వద్ద ర్యాంప్‌ దిగనుంది. ఇక్కడి వరకు రోడ్డును తవ్వారు. బస్టాండు నుంచి బ్యారేజి మీదుగా సచివాలయం, కేఆర్‌ మార్కెట్‌ నుంచి బస్టాండు వైపు వచ్చేందుకు రహదారి చిన్నదైంది. ర్యాంపునకు రెండు వైపులా ఉన్న రహదారులు కుచించుకుపోయాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా కృష్ణవేణి ఘాట్‌ వైపు రోడ్డును విస్తరించారు. అండర్‌ పాస్‌ల వద్ద బస్సులు తిరిగేందుకు కష్టంగా మారడంతో పోలీసులు ఘాట్‌ మెట్ల వరకు రోడ్డును విస్తరించి రెయిలింగ్స్‌ను ఏర్పాటు చేశారు. పెద్ద అండర్‌పాస్‌లో రెండు మార్గాలు ఉన్నాయి. దీంతో ఒక దాంట్లో నుంచి బ్యారేజి, సచివాలయం, కనకదుర్గ ఆలయానికి వెళ్లేలా ట్రాఫిక్‌ను మార్చారు. ఇందులోనే మరో మార్గంలో కేఆర్‌ మార్కెట్, చిట్టినగర్‌ వైపు వెళ్లే ఆర్టీసీ, సిటీ బస్సులు వెళ్లేందుకు అనుమతించారు. రెండో అండర్‌పాస్‌లో ఒక వరుస మార్గమే ఉంది. బ్యారేజి, సచివాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇటువైపు వాహనాలు పెరిగితే ట్రాఫిక్‌ జామ్‌లు తప్పేలా లేవు. ఈ ప్రభావం ఈ ప్రాంతంలోని అన్ని మార్గాల్లో పడే ప్రమాదం ఉంది.