గుంటూరు, ఏప్రిల్ 13, (way2newstv.com)
రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది.ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్ సరళిని కాపాడారు.
మూడు షిప్టులలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద టీడీపీ కేడర్
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు’’ అని చంద్రబాబు అన్నారు. ఇక మరో పక్క, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపెవరిదో తేల్చే ఈవీఎంలు వివిధ జిల్లాల్లోని స్ట్రాంగ్ రూములకు చేరాయి. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి. తొలి దశలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తలుపులకు సీల్ వేసిన చోట సాయుధులైన కేంద్ర బలగాలు కాపలా ఉంటాయి.ఇది మొదటి దశ భద్రత. ఇక రెండో దశలో రాష్ట్ర పత్యేక బలగాలు కాపలా ఉంటాయి. మూడో దశలో స్ట్రాంగ్ రూములకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ, రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. ఇక ప్రధాన పార్టీల ఏజంట్లు కూడా స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉండనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు ఫిఫ్ట్ ల వారీగా ఈవీఎంలకు కాపలా కాయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ కార్యకర్తలను ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉంచనుంది. మొత్తం 40 రోజుల పాటు ఈవీఎంలను భద్రతా దళాలు కాపాడనుండగా, వచ్చే నెల 23న వీటిని బయటకు తీసి, ఓట్లను లెక్కించనున్నారు.