ఆదిలాబాద్, ఏప్రిల్ 20(way2newstv.com):
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో విద్యావలంటీర్ల నియామకాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. అయితే, ప్రతీ సంవత్సరం జూన్, జూలై మాసంలో వీవీల నియామకాలు చేపట్టగా, ఈసారి మాత్రం ఈ వేసవిలోనే నియామకాలు జరగనున్నట్లు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి. బడులు తెరిచిన మొదటి రోజే ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో వీవీల ద్వారా విద్యాబోధన చేయించడానికి విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందగా, నోటిఫికేషన్ విడుదల కాగానే నియామకాలు చేపట్టేందుకు వారు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, పదవి విరమణ పొందే ఉపాధ్యాయుల వివరాలను సేకరించి ఆ ఖాళీలకు అవసరమయ్యే వీవీల సంఖ్యను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవి సెలవుల్లోనే విద్యావలంటీర్ల నియామకాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకోగా, ఈ నిర్ణయం విద్యార్థులకు బోధనాపరంగా ఎంతో మేలు చేయనుంది.
గ్రీన్ సిగ్నల్ (ఆదిలాబాద్)
ఆదిలాబాద్ జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయ పోస్టులు చాలానే ఖాళీగా ఉండడంతో కొన్నేళ్లుగా వీవీలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడంతో విద్యావలంటీర్లతోనే బోధన చేయించాల్సి వస్తోంది. అయితే, ప్రతియేటా పాఠశాల ప్రారంభమైన తర్వాత ఒకట్రెండు నెలల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి వీవీలను భర్తీ చేసేవారు. అప్పటి వరకు విద్యార్థులకు బోధించే వారు లేకపోవడంతో పాఠాలు ముందుకు సాగేవి కావు. తాజాగా ప్రభుత్వం ఈ పద్ధతికి స్వస్తి పలికి వేసవి సెలవుల్లోనే వీవీల నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీవీల నియామకానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే ఆరోపణలూ లేకపోలేదు.ఆదిలాబాద్ జిల్లాలో 2018–19 విద్యా సంవత్సరంలో 417 మంది విద్యావలంటీర్లు ఆయా పాఠశాలలో విధులు నిర్వర్తించారు. వీరిలో 154 మంది లాంగ్వేజ్ పండితులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో పని చేసిన వారిని కొనసాగిస్తూనే అదనంగా కొత్తవారిని నియమిస్తారా.. లేక మొత్తం కొత్త వారినే నియమిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా అధికారులు తెలిపారు. ప్రతిసారీ బడులు ముగియగానే విద్యావలంటీర్లను బాధ్యతలను తొలగించి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి కొత్తవారిని నియమిస్తున్నారు.ఇది వరకు పనిచేసిన వారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకొని నిబంధనల ప్రకారం పోస్టును దక్కించుకోవాల్సి వస్తోంది. దీంతో తాత్కాలికంగా పని చేస్తున్న బోధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పాత వారిని అలాగే కొనసాగించాలని హైకోర్టు సూచించడంతో పాత వీవీలకు ఊరట లభించింది. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పాత వారితోపాటు అదనంగా 121 వీవీ పోస్టుల భర్తీ చేయాల్సిన అవసరముందని విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఇటీవల టీఆర్టీ ఫలితాలు విడుదల చేసినా, ఇంకా నియామకాలు చేపట్టలేదు. అదేగానీ జరిగితే పాఠశాలల్లో బోధనపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అవుతుంది.