హైద్రాబాద్, ఏప్రిల్ 2 (way2newstv.com)
హైదరాబాద్ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది చారిత్రాత్మక చార్మినార్. నోరూరించే బిర్యానీ... దగదగలాడే ముత్యాలు.... రంగురంగుల గాజులు.... సువాసనలు వెదజల్లే అత్తర్లు... మత సామరస్యానికి ప్రతీక అయిన పురాతన నగరం. ఇదంతా ప్రపంచానికి కనిపించే నగర ముఖచిత్రం. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. పేదరికం, నిరక్షరాస్యత, మత చాంధసవాదం తాండవిస్తున్నాయి.నగరంలోని పాతబస్తీ ప్రాంతంలోని మలక్ పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదుర్ పురా నియోజకవర్గాలు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వీటిలో గోషామహల్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ శాసన సభ్యులే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గోషామహల్ లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
హైద్రాబాద్ బాద్ షా ఎవరు
చాంద్రాయణగుట్ట రెండున్నర దశాబ్ధాలుగా ఈ లోక్ సభ స్థానం ఆ పార్టీ చేతిలోనే ఉంది.1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలావుద్దిన్ ఓవైసీ, అప్పట్నుంచి 2014 వరకు అసదుద్దిన్ ఓవైసీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అభిమానులు ‘సాలార్’ గా పిలిచే సలావుద్దిన్ ఓవైసీ ప్రస్తుత ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ తండ్రి. రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ అసదుద్దిన్ ఓవైసీ మరో మారు ఇదే స్థానం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అసదుద్ది న్ ఓవైసీపై ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్, టీఆర్ఎస్ నుంచి పుస్తె శ్రీకాంత్, బీజేపీ నుంచి భగవంత్ రావు బరిలో నిలిచారు. టీఆర్ఎస్, ఎంఐఎం మిత్ర పక్షాలైనా నామ మాత్రంగా తమ అభ్యర్థిని బరిలో దింపింది అధికార పార్టీ. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత అభ్యర్థి భగవంత్ రావే బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భగవంత్ రావు 3,11,414 ఓట్లు సాధించగా అసదుద్దిన్ ఓవైసీ 5,13,868 ఓట్లతో విజయం సాధించారు.హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 60 శాతానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. 2009 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు ముందు వికారాబాద్, చేవెళ్ల, తాండూర్ అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో ఉండేవి. పునర్ వ్యవస్థీకరణ సమయంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలన్నింటినీ హైదరాబాద్ కిందికి తెచ్చారని... దీంట్లో అసదుద్దీన్ ఓవైసీ ఒత్తిళ్లు పని చేశాయన్న విమర్శలు కూడా ఉన్నాయి.మరోవైపు... అసదుద్దిన్ ఓవైసీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. పాదయాత్ర చేపడుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.