హైదరాబాద్ ఏప్రిల్ 22 (way2newstv.com)
ఇంటర్ ఫలితాల ప్రకటనలో గందరగోళం నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ చర్యలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 9.45 లక్షల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని, ఫలితంగా 3 రోజుల్లో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ
ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో సబ్జెక్టుల మార్కులకు, మొత్తం మార్కులకు తేడాలున్నాయని వివరించారు. ప్రతిరోజు 40 పేపర్లు దిద్దాల్సిన లెక్చరర్లు 65 పేపర్లు దిద్దారని ఉత్తమ్ లేఖలో ఆరోపించారు. మంచి మార్కులు వచ్చే విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని సూచించారు. కేసీఆర్కు ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ధ్యాస తప్ప.. ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి, అధికారులను వెంటనే బర్తరఫ్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు