హైద్రాబాద్, ఏప్రిల్ 2 (way2newstv.com)
ఓటర్లు ఈజీగా ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ ప్రయత్నిస్తోంది. అందరికీ అందుబాటులో ఎన్నికలు నినాదాన్ని బలపరుస్తూ... నా ఓటు పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఎనిమిది రకాల వివరాల్ని ఉంచారు. ఓటరు పేరు లేదా ఓటర్ కార్డు నంబరును యాప్‌లో ఎంటర్ చేస్తే, ఏ పోలింగ్ బూత్‌లో ఓటు ఉందో చూపిస్తుంది. అంతేకాదు... ఆ పోలింగ్ కేంద్రానికి ఎలా వెళ్లాలో... గూగుల్ మ్యూప్ దారి చూపిస్తుంది. దివ్యాంగులకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయో కూడా వివరాలు ఈ యాప్‌లో ఉన్నాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. నిజానికి ఈ యాప్... డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రవేశపెట్టారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు తగినట్లుగా కొన్ని మార్పులు చేశారు. ప్రస్తుతం నా ఓటు యాప్... హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రెండింటిలోనూ పనిచేస్తోంది
నా ఓటు..యాప్... ఫుల్ క్రేజ్
* ఓటరు తన ఎపిక్ నంబర్, పేరు, నియోజకవర్గాన్ని కనిపెట్టవచ్చు.
* నియోజక వర్గం వారీగా, జిల్లా వారీగా, పోలింగ్ స్టేషన్ వారీగా, బూత్‌ల వారీగా అధికారుల వివరాలు తెలుసుకోవచ్చు.
* నియోజక వర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు తెలుస్తాయి.* ఎపిక్ నంబర్ లేదా ఓటరు పేరు సాయంతో పోలింగ్ స్టేషన్, పోలీస్ స్టేషన్‌లు తెలుసుకోవచ్చు.
* పోలింగ్ స్టేషన్, పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళడానికి గూగుల్ మ్యాప్ రూట్ చూపిస్తుంది.
* దగ్గర్లో బస్టాప్, రైల్వేస్టేషన్, మెట్రో స్టేషన్, టాక్సీల సమాచారం తెలుస్తుంది.
* ఓటరు తన నియోజక వర్గం వివరాలు, అక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నదీ తెలుసుకోవచ్చు.
* దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వెళ్ళిరావడానికి రవాణా సౌకర్యం కల్పించమని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం ‘పికప్ సర్వీస్’ అనే ఆప్షన్ ఉంది. వారు తమ ఎపిక్ నంబర్ నమోదు చేస్తే నిర్దేశిత బీఎల్‌ఓకు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలనే సమాచారం వెళుతుంది. దీనికోసం దివ్యాంగుల ఫోన్ నెంబర్ అనుసంధానం చేసి ఉండాలి. అలా లేకపోయినా సంబంధిత బీఎల్‌ఓకు ఫోన్‌చేస్తే వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తారు.
* జిల్లా ఎన్నికల ఆఫీసర్, ఆయా నియోజక వర్గాల ఆర్వోల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ వివరాలు ఉంటాయి
* ఎన్నికల షెడ్యూల్ మొదలు, ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏఏ తేదీల్లో ఏ కార్యక్రమం ఉంటుందనే సమాచారం యాప్‌లో పొందుపరిచారు.
డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2.6 లక్షల మంది ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు దాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చనీ... లేదా తాజాగా మరోసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.